ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. శనివారం రోజున జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉండబోతోంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాల్సింది. అయితే అప్పుడు ఆ ప్రోగ్రామ్ రద్దు అయ్యింది. మోడీ ప్రధాని గా ప్రమాణ స్వీకారానికి జగన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నా వెళ్లలేకపోయారు.
ఇక ఇప్పుడు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మోడీతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం కావడం ఖాయమే అని తెలుస్తోంది. ఇటీవలే మోడీ తిరుమల వచ్చారు. ఆ సందర్భంలో రాజకీయ చర్చలు ఏమీ జరగలేదు. అయితే ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్న జగన్ మోహన్ రెడ్డి మోడీతో రాజకీయ పరమైన సమావేశం జరపవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు.
ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కూడా జరగబోతూ ఉంది. ఇటీవలే లోక్ సభకు ఎన్నికైన ఇరవై రెండు మంది ఎంపీలతో సహా రాజ్యసభ సభ్యులతోనూ జగన్ మోహన్ రెడ్డి అక్కడ సమావేశం కాబోతూ ఉన్నారు. లోక్ సభ, రాజ్యసభల్లో వ్యవహరించాల్సిన తీరు గురించి అక్కడ వారు చర్చించే అవకాశం ఉంది.
ప్రత్యేకహోదానే తమ అజెండా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతూ ఉంది. ఇప్పటికీ ఆ అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అజెండాగానే పెట్టుకుంది. ఈ నేపథ్యంలో లోక్ సభలో వ్యవహరించాల్సిన తీరు గురించి జగన్ మోహన్ రెడ్డి ఎంపీలతో మాట్లాడనున్నారని సమాచారం.
ఇక లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ వచ్చింది. వైఎస్సార్సీపీ ఎంపీల్లో ఒకరిని లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ నియమించేందుకు బీజేపీ ఓకే చెప్పిందని సమాచారం. ఈ అంశంపై జగన్ మోహన్ రెడ్డి ఇంకా ఆలోచిస్తూ ఉన్నారట. ఈ క్రమంలో ఢిల్లీ పర్యటనలో ఆ వ్యవహారంపై కూడా జగన్ పూర్తి స్పష్టతను ఇచ్చే అవకాశం ఉంది.
No comments:
Post a Comment