ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరస పెట్టి ఇస్తున్న షాకులకు తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్ ఇవ్వడానికి బీజేపీ రెడీ అవుతోందని వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో కనీసం ముగ్గురు ఎంపీలు అయినా నెగ్గారనే ఆనందంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బీజేపీ ఝలక్ ఇవ్వబోతోందట. గెలిచిన ఎమ్మెల్యేలను తెలంగాణ రాష్ట్ర సమితి లాగేసుకోగా.. ఎంపీలను బీజేపీ తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ తరఫున ఎంపీలుగా నెగ్గిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డిల మీద భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టిందని సమాచారం. వారిని చేర్చుకోవడానికి బీజేపీ రెడీ అవుతోందట. ఇప్పటికే సంప్రదింపులు మొదలయ్యాయని సమాచారం. బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ ఈ విషయంల పై దృష్టి పెట్టారని.. కాంగ్రెస్ నేతలతో ఆయన సంప్రదింపులు చేపట్టారని సమాచారం. ఢిల్లీలో ఇందుకు సంబంధించిన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయట.
ఈ సిట్టింగ్ ఎంపీలతో పాటు మరి కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని, వారందరినీ ఒకేసారి చేర్చుకోవాలని బీజేపీ అనుకుంటోందని సమాచారం. ఆ జాబితాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ తదితరులు కూడా ఉన్నారట.
ఇప్పటికే తెలంగాణ తెలుగుదేశం నేతలు కొందరు భారతీయ జనతా పార్టీ మీద దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీకి ఆ రాష్ట్రంలో ఎలాంటి భవితవ్యం లేదనే అంచనాకు వచ్చి వారు బీజేపీ వైపు చూస్తున్నట్ఉటగా తెలుస్తోంది. ఇప్పటికే వారితో సంప్రదింపులు పూర్తి అయ్యాయని సమాచారం.
తెలంగాణలో బలోపేతం కావాలని బీజేపీ గట్టిగా ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. ఇటీవల లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఏకంగా నాలుగు ఎంపీ సీట్లను నెగ్గి సంచలనం రేపింది. ఇదే ఊపులో చేరికల ద్వారా మరింత బలోపేతం కావాలని కమలం పార్టీ భావిస్తున్నట్టుగా ఉంది. అందులో భాగంగా కాంగ్రెస్ బుట్టలో బీజేపీ చేతులు పెడుతోందని టాక్!
No comments:
Post a Comment