ఈ సారి ప్రపంచకప్ ప్రాబబుల్స్ లో బాగా వినిపించిన పేరు రిషబ్ పంత్. ఈ యంగ్ క్రికెటర్ కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కుతుందని చాలా మంది అంచనా వేశారు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అయిన పంత్ గత కొన్నేళ్లలో సంచలన ప్రదర్శన చేశాడు. ఆ లెక్కలతోనే ఇతడికి వరల్డ్ కప్ టీమిండియాలో కూడా చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు.
అయితే పంత్ కు చివరకు మొండిచేయి చూపారు సెలెక్టర్లు. దానికి కారణం కీపర్, మాజీ కెప్టెన్ ధోనీ ప్రపంచకప్ జట్టులో ఉండటమే. ధోనీ లాంటి అనుభవజ్ఞుడిని కాదనుకుని, పంత్ కు వికెట్ కీపింగ్ బాధ్యతలు ఇచ్చే పరిస్థితి లేదు.
ఈ నేఫథ్యంలో ఈ యువ క్రికెటర్ కు నిరాశ తప్పలేదు. మరో నాలుగేళ్ల వరకూ ప్రపంచకప్ లో ఆడే అవకాశం రాదనే అంతా అనుకున్నారు. అయితే తీరా ప్రపంచకప్ ప్రారంభం అయ్యాకా పంత్ కు అవకాశం తలుపు తట్టింది!
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో గాయపడి టోర్నీకి దూరం అయ్యాడు. ధావన్ కనీసం మూడు వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తేల్చారు. దీంతో ధావన్ ఈ వరల్డ్ కప్ లో ఆడే అవకాశాలు ఇక లేవని తేలింది.
ఈ నేఫథ్యంలో ప్రత్యామ్నాయంగా పంత్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఈ యువ క్రికెటర్ కు ఇంగ్లండ్ వీసా వచ్చేసినట్టే అని తెలుస్తోంది. పంత్ ను అర్జెంటుగా వెళ్లి జట్టుతో కలవాలని బీసీసీఐ ఆదేశించిందట. ప్రపంచకప్ ఆడేందుకు మరో నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయాలనుకున్న క్రికెటర్ కు ఇలా అనుకోకుండా అవకాశం దక్కుతుండటం గమనార్హం.
No comments:
Post a Comment