ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, March 07, 2019

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు?

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ జూనియర్ ఎన్టీఆర్ మౌనం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ వైఖరితో కలవరపడుతోంది. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ కరువయ్యారు. ఈ నేపథ్యంలో జూనియర్ తో వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయించుకుని అధికారంలోకి రావాలని వ్యూహాలు పన్నుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అయితే వాగ్ధాటిగా ప్రసంగించగలడని, తమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించగలరని భావిస్తోంది. అయితే ఇందుకు ఎన్టీఆర్ ఏ మాత్రం సుముఖంగా లేడని సమాచారం.

2009 ఎన్నికల్లో తనను వాడుకుని వదిలేసిన తీరు, నాన్నకు ప్రేమతో, తదితర తన సినిమాలకు ఆంధ్రాలో థియేటర్లు దక్కనీయకుండా చేసిన వైనం, తాను విజయవాడ వస్తే ఎవరూ స్వాగతం పలకకూడదని టీడీపీ నేతలకు చంద్రబాబు జారీ చేసిన హుకుం, తనపై గత ఎన్నికల సందర్భంగా ఎన్టీటీవీ, తదితర ఎల్లో మీడియా చానళ్లలో 'పిల్ల కాకి' అంటూ ప్రత్యేక కథనాలు వేయించడం, తనపై టీడీపీ నేతలతో విమర్శలు చేయించడం, ఇప్పటికీ తనను ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడిగా గుర్తించకపోవడం వంటి కారణాలతో రగిలిపోతున్న జూనియర్ ఎన్టీఆర్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు.

వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు తీరు, నారా లోకేశ్ ను భావి సీఎంగా, టీడీపీ అధ్యక్షుడిగా చేయడం కోసం పోటీ అవుతాడనుకుంటున్న తనను అణగదొక్కడం వంటివాటిని బాగా అర్థం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల రెండు పార్టులుగా విడుదలైన 'కథానాయకుడు', 'మహానాయకుడు' గురించి ఎక్కడా మాట్లాడకపోవడం, కనీసం సినిమా బాగుందని సోషల్ మీడియాలోనూ ఒక మేసేజ్ పెట్టకపోవడం జూనియర్ ఎన్టీఆర్ వైఖరిని సూచిస్తున్నాయి. అంతేకాకుండా తెలంగాణ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో పోటీ చేసిన తన సోదరి సుహాసిని తరఫున కూడా ఎక్కడా ప్రచారం చేయలేదు. ట్విట్టర్ లో కూడా 'మా కుటుంబ సభ్యురాలిగా పోటీ చేస్తున్న సోదరి సుహాసినికి శుభాకాంక్షలు. మా తాత ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తరఫున మా నాన్న (హరికృష్ణ), ఇప్పుడు మా సోదరి సుహాసిని పోటీ చేస్తున్నారు' అంటూ పేర్కొన్న జూనియర్ ఎన్టీఆర్ ఇందులో ఎక్కడా చంద్రబాబు పేరు తలవకపోవడం గమనార్హం.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతి తండ్రి నార్నె శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా జూనియర్ వ్యూహమేనని తెలుస్తోంది. ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీకి తానే దిక్కని, పార్టీ తన శరణు వేడటం ఖాయమని ఆయన భావిస్తున్నారు. నారా లోకేశ్ కు టీడీపీ పార్టీ పగ్గాలు అప్పగిస్తే అది పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమేనని ఆయన అనుకుంటున్నారు. సరైన టైమ్ కోసం వేచిచూస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad