ఆ ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలకు ఈసారి షాక్ తప్పదా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, March 01, 2019

ఆ ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలకు ఈసారి షాక్ తప్పదా?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలకు సీటు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఈ జాబితాలో ఉన్నారు.

ఈ ముగ్గురు మహిళలకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వవద్దని ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా మంత్రిగా కూడా ఉన్న భూమా అఖిలప్రియను మార్చాల్సిందేనని లేదంటే తాను పార్టీ వీడతానని పార్టీ ఏవీ సుబ్బారెడ్డి తేల్చిచెబుతున్నారు. అదేవిధంగా అభ్యర్థిగా తనను ప్రకటించాలని చంద్రబాబును కోరుతున్నారు. ఈ విషయంపై సీరియస్ గా ఉన్న అఖిలప్రియ ఇటీవల చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు డుమ్మాకొట్టారు.

ఇక నందిగామ ఎమ్మెల్యే సౌమ్య తన తండ్రి ప్రభాకరరావు మరణించాక జరిగిన ఉప ఎన్నికలో గెలిచారు. ఆమె కూడా పార్టీ నేతలకు అందుబాటులో ఉండటం లేదని, పార్టీ నేతలకు ఏమైనా పనులు కావాల్సి వస్తే చేయడం లేదని కుప్పలుతెప్పలుగా చంద్రబాబుకు ఫిర్యాదులు వెళ్లాయి. నియోజకవర్గంలో పలువురు నేతలు బహిరంగంగానే సౌమ్యకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

అదేవిధంగా టీడీపీలో ముఖ్యంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా ఎప్పుడూ గళమెత్తుతుండే పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు ఈసారి టికెట్ హుళక్కేనని సమాచారం. ఆమెకు వ్యతిరేకంగా నియోజకవర్గ టీడీపీ నేతలు, మండల అధ్యక్షులు చంద్రబాబుకు వినతిపత్రం సమర్పించారు. అనితకు టికెట్ ఇస్తే టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని, ఆమెను తప్పించి ఎవరికిచ్చినా కష్టపడి గెలిపించుకుంటామని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తున్న చంద్రబాబు ఈ మూడు నియోజకవర్గాలను ఇంకా పెండింగ్ లోనే పెట్టారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad