మరదలుకు టికెట్ ఇచ్చారని మండిపడుతున్న మంత్రి బావ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, February 24, 2019

మరదలుకు టికెట్ ఇచ్చారని మండిపడుతున్న మంత్రి బావ

తన మరదలు (తమ్ముడి భార్య) అనీషా రెడ్డికి పుంగనూరు అసెంబ్లీ టికెట్ కేటాయించడంపై మంత్రి అమరనాథరెడ్డి మండిపడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం అమరనాథరెడ్డి చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యేగా, చంద్రబాబు మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన ఆయన పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరి మంత్రి పదవిని దక్కించుకున్న సంగతి తెలిసిందే.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పలమనేరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే యోచనలో ఉన్నారు. అయితే అనూహ్యంగా తనను సంప్రదించకుండా తన మరదలు అనీషా రెడ్డికి పుంగనూరు అసెంబ్లీ టికెట్ కేటాయించడంపై మంత్రి తీవ్ర మనస్తాపానికి గురయినట్టు సమాచారం. దీనిపై ఆయన చంద్రబాబును ప్రశ్నించగా పుంగనూరులో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించాలంటే అనీషారెడ్డే కరెక్ట్ అని చెప్పినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం పుంగనూరుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజంపేట లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి పుంగనూరు వస్తుంది. గత ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి.. రామచంద్రారెడ్డి కుమారుడే. వచ్చే ఎన్నికల్లో కూడా పుంగనూరు నుంచి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటరీ స్థానం నుంచి మిథున్ రెడ్డి పోటీ చేస్తారని, వారిని ఓడించాలంటే బలమైన అభ్యర్థులు పోటీలో ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనీషారెడ్డిని పుంగనూరులో బరిలో దించుతున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad