హరీశ్ రావు కింకర్తవ్యం ఇదేనా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, February 24, 2019

హరీశ్ రావు కింకర్తవ్యం ఇదేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడిగా రాజకీయాల్లో ప్రవేశించి అన్నిటిలోనూ మామకు తగ్గ సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు.. హరీశ్ రావు. పార్టీ సమస్యల్లో ఉన్నప్పుడు ట్రబుల్ షూటర్ గా, ఎన్నికల వ్యూహకర్తగా, నిజాయతీపరుడిగా, నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే వ్యక్తిగా హరీశ్ కు పేరు ఉంది. పార్టీలో ఒకప్పుడు కేసీఆర్ తర్వాత స్థానం అంటే నెంబర్ టూ ఆయనే. అయితే ఇదంతా కేసీఆర్ కుమారుడు కేటీఆర్ రాజకీయ ప్రవేశం చేయనంతవరకే. ఎప్పుడైతే కేటీఆర్ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారో అప్పటి నుంచి హరీశ్ రావు ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వచ్చింది.

గత తెలంగాణ మంత్రివర్గంలో శాసనసభా వ్యవహారాలు, సాగునీటి పారుదల వంటి కీలక శాఖలు కట్టబెట్టిన కేసీఆర్ ఈసారి హరీశ్ రావును మంత్రివర్గం నుంచి పక్కనపెట్టారు. అయితే తన కుమారుడు కేటీఆర్ ను కూడా పక్కనపెట్టారు కదా అని విమర్శకులు అంటున్నప్పటికీ పార్టీ అధ్యక్ష పదవిని తను కుమారుడికి కట్టబెట్టారనే సంగతి మరిచిపోకూడదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు సాధించి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము కీలకమైతే కేసీఆర్ కేంద్రానికి వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు సీఎం పదవిని కేటీఆర్ కు అప్పగించే అవకాశం ఉంది. దీనికి సీనియర్ల నుంచి వ్యతిరేకత రాకుండా ముందు పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించి అందరికీ అందుబాటులో ఉంటూ తలలో నాలుకలా వ్యవహరించగలిగితే కేటీఆర్ కు అందరి ఆమోదం లభిస్తుందనేది కేసీఆర్ మాస్టర్ ప్లాన్. అదే క్రమంలో హరీశ్ రావు తన కుమారుడికి పోటీ రాకుండా ఆయనను సిద్ధిపేట నియోజకవర్గానికే పరిమితం చేశారు.

హరీశ్ కు ఇంతటితో అవమానాలు ఆగలేదు. సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షలో దానికి సంబంధం లేనివారందరినీ పిలిచిన కేసీఆర్.. మంత్రిగా పనిచేసి సాగునీటి రంగం - ప్రాజెక్టులపై అపార పట్టు ఉన్న హరీశ్ ను మాత్రం పిలవలేదు. ఈ పరంపర ఇక్కడితో ఆగలేదు. ప్రస్తుతం హరీశ్ హైదరాబాద్ లో మంత్రులకు కేటాయించిన ఇంటిలో ఉంటున్నారు. తెలంగాణలో కొద్ది రోజుల కిందట కొత్త మంత్రివర్గం ఏర్పాటు కాగానే ఉన్నఫలంగా ఆయన్ను ఇళ్లు ఖాళీ చేయాలని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వాస్తవానికి మంత్రులకు ఇళ్లు ఇవ్వాలనుకుంటే హైదరాబాద్ లో చాలా ఇళ్లు ఉన్నాయి. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావడంతో ఏపీ మంత్రులకు కేటాయించిన ఇళ్లు కూడా ఉన్నాయి. అవి ఖాళీగానే ఉంటున్నాయి. అయితే వాటిని పట్టించుకోకుండా హరీశ్ ఉంటున్న ఇంటిని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంపైన, ఇంటిని ఖాళీ చేయించడంపైన ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయని హరీశ్ ప్రస్తుతం తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ముందే చెప్పుకుంటున్నట్టు మామకు తగ్గవాడిగా ఇప్పటికే నిరూపించుకున్న హరీశ్ ప్రస్తుతం నెమ్మదిగా వెళ్లడానికే నిశ్చయించుకున్నారు. అయితే తెలంగాణ ప్రజల్లో మాత్రం హరీశ్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. హరీశ్ కు ఉన్న మాస్ ఇమేజ్, ప్రజలతో సత్సంబంధాలు కేటీఆర్ కు లేవు. కేటీఆర్ వ్యవహార శైలి అంతా కూడా కార్పొరేట్ శైలి. సినిమా నటులు, వ్యాపారవేత్తలతో స్నేహం, హైఫై లైఫ్. కానీ హరీశ్ జీవితం దీనికి భిన్నం. కీడెంచి మేలు ఎంచమన్న సామెతను ప్రస్తుతం అక్షరాలా హరీశ్ పాటిస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad