రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, August 29, 2018

రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం

harikrishna dead

ఎన్.టి.రామారావు కుమారుడు, మాజీ ఎమ్.పి, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలు పాలై కన్నుమూశారు. స్వయంగా వాహనం నడుపుతూ, వేగంగా వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి బోల్లా పడింది. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను స్థానికులు వెంటనే అక్కడకు సమీపంలో ఉన్న కామినేని ఆస్పత్రికి తరలించారు. హరికృష్ణ నెల్లూరు వెళుతుండగా అద్దంకి రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. హరికృష్ణే ఈ వాహనం నడుపుతున్నారని సమాచారం. హరికృష్ణ వేగంగా వాహనం నడుపుతూ ఒక వాహనాన్ని డీకొట్టారని, దాంతో అది అదుపు తప్పి, పక్కన ఉన్న రోడ్డుపై మరో వాహనాన్ని కూడా డీకొట్టిందని ఎస్.పి చెప్పారు. మరో ఇద్దరు కూడా గాయపడ్డారు.

ఇదే రోడ్డుపై...
గతంలో హరికృష్ణ కుమారుడు జానకీరాం కూడా ఇదే రోడ్డుపై ప్రమాదానికి గురై చనిపోయారు. హరికృష్ణ కూడా ఇప్పుడు ప్రమాదానికి గురి అయ్యారు. అంతకుముందు ప్రముఖ నటుడు హరికృష్ణ కుమారుడు, ఎన్.టి.ఆర్ కు కూడా ప్రమాదం ఎదురైంది. గాయాలతో ఆయన బయటపడ్డారు.

హరికృష్ణ ప్రస్థానం
హరికృష్ణ 1995లో ఎన్.టి.ఆర్.పై తిరుగుబాటు సమయంలో బాగా వెలుగులోకి వచ్చారు. తండ్రికి వ్యతిరేకంగా తన బావ చంద్రబాబు నాయుడుకు ఆయన మద్దతు ఇచ్చారు.
ఎన్.టిఆర్.రెండో భార్య లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా ఈయన ప్రచారం చేశారు. ఎన్.టి.ఆర్.పదవిచ్యుతి తర్వాత చంద్రబాబు క్యాబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా హరికృష్ణ ఆరునెలలు పనిచేశారు. కాని అప్పటికీ ఆయన ఎమ్మెల్యే కారు.దాంతో ఆరు నెలల్లో మంత్రి పదవిని వదలుకోవలసి వచ్చింది. తదుపరి హిందుపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా చంద్రబాబు ఈయనకు తిరిగి మంత్రి పదవి ఇవ్వలేదు. తదుపరి చంద్రబాబు ను వ్యతిరేకించి అన్న టిడిపి అనే పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. కాని సఫలం కాలేకపోయారు. ఆ తర్వాత కొంతకాలం టిడిపికి దూరంగా ఉన్నా, తిరిగి పార్టీలో చేరి రాజ్యసభ సబ్యుడు అయ్యారు.పాలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా అయ్యారు. సమైక్య రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.ఎన్.టి.ఆర్.పార్టీ పెట్టినప్పుడు ఆయన చైతన్య రధంలో పర్యటించేవారు. ఆ రదానికి హరికృష్ణ డ్రైవర్ గా కూడా వ్యవహరించేవారు. డ్రైవింగ్ అంటే ఇష్టపడే హరికృష్ణ , అదే డ్రైవింగ్ లో మరణించడం విషాదం.హరికృష్ణ వయసు అరవై ఒక్క సంవత్సరాలు.సినిమా రంగంలో కూడా ఆలస్యంగా ప్రవేశించి కొన్ని సినిమాలలో ప్రత్యేక పాత్రలు పోషించారు.

సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల..
సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల మాజీ ఎమ్.పి నందమూరి హరికృష్ణ మరణించాడని ఆయనతో పాటు ప్రయాణం చేసిన స్నేహితుడు అరికపూడి శివాజీ చెప్పారు. మీడియాకు ఆయన ప్రమాదం జరిగిన తీరును వివరించారు.శివాజీతో పాటు వెంకట్రావు అనే మరో స్నేహితుడు కూడా వాహనంలో ఉన్నారు. వీరిద్దరూ గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు ఉదయం నాలుగున్నర గంటలకు హైదరాబాద్‌ నుంచి కారులో బయలు దేరామని, హరికృష్ణే కారు నడిపారని శివాజీ వివరించారు. ముందు సీట్లో తాను కూర్చున్నానని, వాహనం రాయిపై ఎక్కడం వల్ల అదుపు తప్పిందని ఆయన వివరించారు. హరికృష్ణ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో ప్రమాద సమయంలో కారులో నుంచి ఎగిరి బయటకు పడ్డారని చెప్పారు. తాము సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల ప్రమాదం నుంచి బయటపడగలిగామని వెల్లడించారు. ప్రమాదం సమయంలో కారు వేగం 100 కిలోమీటర్ల వేగం ఉండవచ్చునని శివాజీ అన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad