ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం, రెండో రోజున స్పీకర్ ఎన్నిక సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్యన గట్టి వాదోపవాదాలు జరిగాయి. ఈ వాదోపవాదాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అధికార పార్టీకి బాగానే చిక్కారు. స్పీకర్ ఎన్నిక అనంతరం చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయనను గట్టిగానే కార్నర్ చేసింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబును ఇరకాటంలో పెట్టారు. తన వాగ్ధాటితో జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబును పూర్తిగా కార్నర్ చేయగలిగారు. అసెంబ్లీలో రెండో రోజే చంద్రబాబుకు అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది.
ముందుగా స్పీకర్ ఎన్నిక అనంతరం సీఎం మాట్లాడుతూ.. గత ఉదంతాలను ప్రముఖంగా పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని ప్రస్తావించారు. ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ కొనుక్కొంటే దేవుడు, ప్రజలు ఆ పార్టీకి సరిగ్గా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలనే ఇచ్చారని, ముగ్గురు ఎంపీలను కొనుక్కొంటే సరిగ్గా ఆ పార్టీకి మూడు ఎంపీలే దక్కాయని జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫిరాయింపు రాజకీయాలపై జగన్ అలా చీల్చి చెండాతుంటే చంద్రబాబు నాయుడు మారు మాట్లాడలేకపోయారు.
తను వివాదం చేయాలని అనుకోవడం లేదంటూ.. ఏదో చంద్రబాబు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే జగన్ దానికి కూడా గట్టి పంచ్ విసిరారు. ఎమ్మెల్యేల కొనుగోలు, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం గురించి తాము మాట్లాడుతుంటే.. చంద్రబాబు నాయుడు ఏదో అసంబద్ధంగా మాట్లాడుతున్నారంటూ జగన్ క్లాస్ పీకారు.
ఇక స్పీకర్ వెంట వచ్చి ఆయనను సీట్లో కూర్చోబెట్టడం అంశంలో కూడా చంద్రబాబు నాయుడు కార్నర్ అయ్యారు. స్పీకర్ వెంట వెళ్లడం విషయంలో తనను ఎవరూ పిలవలేదు అని చంద్రబాబు నాయుడు బుకాయించే ప్రయత్నం చేశారు. అయితే ఆ విషయంలో కూడా జగన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
నూతన స్పీకర్ ను వేదిక మీద కూర్చోబెట్టడానికి బొట్టు పెట్టి పిలిచేది ఏమీ ఉండదని, ప్రొటెం స్పీకర్ ఆ విషయంలో పిలిచారని, అన్ని పార్టీల వారూ ముందుకు రావాలని ప్రొటెం స్పీకర్ చెప్పారని, ఆ విషయం రికార్డు అయ్యిందని జగన్ గుర్తు చేశారు.
దీంతో చంద్రబాబు వద్ద సమాధానం లేకుండా పోయింది. ప్రొటెం స్పీకర్ పిలిచినా చంద్రబాబు నాయుడు స్పీకర్ కోసం ముందుకు రాలేదని స్పష్టం అయ్యింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడేది ఏమీ లేకుండా పోయింది. ఇలా రెండో రోజే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అధికార పక్షానికి ఇలా దొరికారు!
No comments:
Post a Comment