ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు ఆసక్తిదాయకమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. స్పీకర్ ఎన్నిక జరిగిన రోజున అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్యన రచ్చ జరిగింది. స్పీకర్ ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం ఆయనను వేదిక మీదకు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ముందుకు రాకపోవడం వివాదంగా మారింది.
సాధారణంగా స్పీకర్ ఎన్నిక జరిగాకా ఆయనను వేదిక మీదకు తీసుకురావడానికి ప్రతిపక్ష నేత కూడా ముందుకు వస్తూ ఉంటారు. అయితే చంద్రబాబు నాయుడు అందుకు ముందుకు రాలేదు. ఈ అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది.
సభా సంప్రదాయానికి చంద్రబాబు నాయుడు విలువ ఇవ్వని వైనాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసింది.
ఆ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. 'బీసీ వర్గానికి చెందిన స్పీకర్ ను వేదిక మీదకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు ముందుకు రాలేదు. అదీ ఆయన సభా మర్యాద. తను ముందుకు రాకుండా తన బంట్రోతులా అచ్చెన్నాయుడును పంపించారు..' అని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఆ మాట మీద తెలుగుదేశం పార్టీ దుమారం రేపే ప్రయత్నం చేసింది. అచ్చెన్న తనకు అవమానం జరిగిందని అన్నారు. తనను 'బంట్రోతు' అని అన్నారని వాపోయారు. ఆ విషయంపై చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తమకు క్షమాపణ చెప్పాలని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
అక్కడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గట్టిగా తగులుకున్నారు. ఇదే శాసనసభలో గతంలో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ నేతలు గుర్తు చేశారు. జగన్ ను ఉద్దేశించి గతంలో అచ్చెన్నాయుడు ఏం మాట్లాడారో గుర్తు చేశారు. 'మగాడివి అయితే..' అంటూ అచ్చెన్న మాట్లాడారని.. అప్పుడు ఎన్ని క్షమాపణలు చెప్పారో చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. తను క్షమాపణలు చెప్పడానికి రెడీ అని, అయితే గతంలో మాటలకు అచ్చెన్న ఏం చెబుతారు? అని చెవిరెడ్డి ప్రశ్నించారు.
రోజా మాట్లాడుతూ.. గతంలో మాట్లాడిన మాటలకు అచ్చెన్నాయుడు ఎలా స్పందిస్తారు? అని ప్రశ్నించారు. దీంతో తెలుగుదేశం వాళ్లు కిక్కుమనలేదు. ఆ అంశాన్ని అంతటితో వదిలేస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రకటించేసి మిన్నకుండా పోయారు! ఇలా తొలి రోజే తెలుగుదేశం పార్టీ గతంలో తను వ్యవహరించిన తీరుతో కార్నర్ అయ్యింది!
No comments:
Post a Comment