Video Of Day

Breaking News

ఎర్రబెల్లికి రేవంత్ ఘాటు సమాధానం

హైదరాబాద్ : 
నిజాం నవాబుకు కప్పం కడుతూ... ప్రజల ఆస్తులు కొల్లగొడుతూ, వారిని హింసిస్తూ గడీలలో పాలనలో కొనసాగించేవారిని దొరలు అనేవారిని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 'దొర' అంటే ఒక్క వెలమ కులం వారే కాదని, నిజాం నవాబ్ సమయంలో వెలమలతో పాటు రెడ్డిలు, దేశ్ ముఖ్ లు ఆఖరికి ముస్లింలు కూడా దొరలుగా వ్యవహరించేవారని అన్నారు. స్థూలంగా చెప్పాలంటే నిజాం హయంలో దొర అనేది దోపిడీకి పర్యాయపదమని... ప్రజల సొమ్మును ఎవరైతే కొల్లగొడతున్నారో వారిని తెలంగాణలో బడుగు ప్రజలు దొర అని పిలుచుకునేవారని పేర్కొన్నారు. అలాగే, ప్రస్తుతం ప్రజల సొమ్మును ఎవరైతే అన్యాయంగా దోచుకుంటున్నారో వారిపైన మాత్రమే తాను 'దొర' ఫదాన్ని ఉపయోగించానని ఆయన స్పష్టం చేశారు
దొర అనే మాట ఒక్క వెలమ కులానికే సొంతం కాదని రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు.
'దొర' అన్నమాటకు ఎర్రబెల్లి ఎందుకు అంత బాధపడుతున్నారో తనకు అర్థం కావట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. కర్నాటకలో గాలి జనార్థన్ రెడ్డి అండ్ కో కుంభకోణాలు గురించి స్టోరీలు వేసినప్పడు నేషనల్ మీడియాతో పాటు లోకల్ మీడియా కూడా 'రెడ్డి బ్రదర్స్' అంటూ పాయింట్ అవుట్ చేసి కథనాలు ప్రసారం చేసారని, 'రెడ్డి బ్రదర్స్' అంటూ మీడియాలో కథనాలు వస్తే... దేశంలోని రెడ్డిలందరినీ అన్నట్టు కాదు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. 
మైహోమ్స్ రామేశ్వర్ రావు బంధువు కాబట్టి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన చెప్పింది నమ్ముతున్నాడని ఆయన అన్నారు. సామాజిక వర్గం పేరు చెప్పి రామేశ్వరరావు,కేసీఆర్ లు దయాకర్ రావును( వీరు ముగ్గురు వెలమ సామాజిక వర్గానికి చెందినవారే) ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు చాలా మంచివాడని, అమాయకుడిని... ఆయన అమయాకత్వాన్ని ఆసరాగా చేసుకుని కేసీఆర్, రామేశ్వరరావులు ఆయనను మభ్యపెడుతున్నారని రేవంత్ ఆరోపించారు.

మైహోమ్స్ అధినేత రామేశ్వరరావుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పన్నంగా 2,000కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టిందని... దీనికి సంబంధించి తన దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయని రేవంత్ చెప్పారు. తన ఆరోపణలు చేసిన మరుసటి రోజే రామేశ్వరరావు తనపై పరువు నష్టం దావా వేస్తానని స్టేట్ మెంట్ ఇచ్చాడని..కానీ, ఇప్పటివరకు దావా వేయలేదని రేవంత్ చెప్పారు. అక్రమంగా భూమిని ఆర్జించాడు కాబట్టే... తనపై దావా వేస్తే కోర్టులో అన్ని విషయాలు బయటకు వస్తాయని వెనకడుగు వేసాడని ఆయన అన్నారు.
రాజకీయాలు వేరు, బంధుత్వం వేరని రేవంత్ అన్నారు. రాజకీయాలతో బంధుత్వాలను ముడిపెడితే ప్రజలకు అన్యాయం చేసినట్టేనని ఆయన స్పష్టం చేశారు. తప్పుచేసినప్పుడు సొంతవారైనా వెనకేసుకు రాకూడదని ఆయన ఎర్రబెల్లికి సూచించారు. అక్రమాలకు పాల్పడినా..తనకు చుట్టమో,బంధువో కాబట్టి వదిలివేయాలని అనుకుంటే రాజకీయాల్లో ఇక పోరాటం చేయలేమని రేవంత్ స్పష్టం చేశారు.
'దొర' అన్నందుకు ఎర్రబెల్లి ఇంతగా బాధపడుతున్నారని...కానీ, చంద్రబాబునాయుడును,తనను టీఆర్ఎస్ నేతలు రోజూ అడ్డమైన తిట్లు, భూతులు తిడుతుంటే ఆయనకు బాధ కలగలేదా అని ప్రశ్నించారు.ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బు ఇచ్చి... గెలిచిన తర్వాత శాసనసభా పక్ష నేత పదవి ఇచ్చి ఎర్రబెల్లిని గౌరవించిన చంద్రబాబును టీఆర్ఎస్ నాయకులు పరుష పదజాలంతో రోజూ దూషిస్తూ ఉంటే ఎర్రబెల్లి ఎందుకు ఖండించలేదని ఆయన ప్రశ్నించారు.
ఎర్రబెల్లి తనకు అత్యంత సన్నిహితుడని, ఆయన తెలంగాణలో తమకు నాయకుడని రేవంత్ అన్నారు. ఎర్రబెల్లిని శాసనసభా పక్ష నేతగా నియమించాలని తానే ప్రతిపాదించానని రేవంత్ గుర్తుచేశారు. కేసీఆర్, రామేశ్వరరావుల మాయలో పడొద్దని ఆయన ఎర్రబెల్లిని హెచ్చరించారు. మెట్రో భూముల విషయంలో అఖిల పక్షం ఏర్పాటు చేసి వివరాలు తమ మందు పెట్టాలని ఎర్రబెల్లితో పాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా డిమాండ్ చేసారని... అయినా ఈ విషయంలో. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. మెట్రోభూముల విషయంలో పారదర్శకత లేదు కాబట్టే, ప్రభుత్వం అఖిలపక్షం ఊసెత్తడం లేదన్నారు.
మైహోమ్స్ రామేశ్వరరావుపై తన ఆరోపణలు తప్పైతే తాను ఎర్రబెల్లితో సహా టీఆర్ఎస్ నాయకులందరికీ భేషరతు క్షమాపణలు చెబుతానని, ఒకవేళ తన ఆరోపణలు నిజమైతే టీఆర్ఎస్ ప్రభుత్వం తనకు క్షమాపణలు చెప్పక్కరలేదని... కేవలం మై హోమ్స్ రామేశ్వరరావుకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంటే చాలని రేవంత్ అన్నారు. ఈ విషయంలో, తాను ఏమాత్రం తగ్గనని, మెట్రో విషయంలో ప్రభుత్వం ఇలాగే అక్రమ వ్యవహారాలను కొనసాగిస్తే శాసనసభా సమావేశాలను రచ్చ రచ్చ చేస్తానని ఆయన హెచ్చరించారు.

No comments