రైల్వే, న్యాయ మంత్రులు బన్సల్, ఆశ్వనీ ఔట్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, May 11, 2013

రైల్వే, న్యాయ మంత్రులు బన్సల్, ఆశ్వనీ ఔట్


* ప్రధానికి లేఖలు సమర్పించిన మంత్రులు
* వాటిని రాష్ట్రపతి ఆమోదానికి పంపి

న పీఎంఓ
* చేతులు కాలాక ఆకులు పట్టుకున్న కాంగ్రెస్
* కళంకితుల కొనసాగింపును సొంత నేతలే తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆందోళన
* మన్మోహన్‌తో సోనియా భేటీ..
* మంత్రులను తప్పించాలని నిర్ణయం
* ప్రధాని నివాసంలో రోజంతా హైడ్రామా
* వ్రతం చెడ్డా కాంగ్రెస్‌కు ఫలం దక్కలేదంటున్న పరిశీలకులు
* ఖర్గేకు రైల్వే.. త్వరలో కేబినెట్ మార్పులు!

ఇలా మసి పూశారు
అశ్వనీకుమార్ : బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న దర్యాప్తులో అనుచితంగా వేలు పెట్టారు. దానిపై సీబీఐ రూపొందించిన స్థాయీ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించే ముందే తెప్పించుకుని చదివారు. అందులోని కీలకమైన భాగాలను స్వయంగా తొలగించి కోర్టు ఆగ్రహానికి గురయ్యారు.

న్యూఢిల్లీ: దేశవ్యాప్త ఒత్తిడికి పాలక యూపీఏ కూటమి సారథి కాంగ్రెస్ ఎట్టకేలకు తలొగ్గింది. చేతులు పూర్తిగా కాలాక తీరిగ్గా ఆకులు పట్టుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో తన కళంకిత మంత్రులిద్దరినీ తప్పించింది. బొగ్గు కుంభకోణంపై సీబీఐ నివేదికను ఇష్టానుసారం మార్చేసిన కేంద్ర న్యాయ మంత్రి అశ్వనీకుమార్, రైల్వే బోర్డులో లాభదాయక పోస్టును అమ్మకానికి పెట్టి సీబీఐకి అడ్డంగా దొరికిన మేనల్లుడి నిర్వాకంతో విమర్శల జడిలో తడిసిన రైల్వే మంత్రి పవన్‌కుమార్ బన్సల్ (64)లను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించింది.

ఇలా ట్రాక్ తప్పారు
పవన్‌కుమార్ బన్సల్ : రైల్వేలో అత్యంత లాభసాటి పదవిని కట్టబెట్టేందుకు ఓ ఉన్నతాధికారి నుంచి తన మేనల్లుడు రూ. 90 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా సీబీఐకి పట్టుబడటంతో చిక్కుల్లో పడ్డారు. పైగా సొంత కుటుంబీకులకు చెందిన కంపెనీలకు భారీగా అనుచిత లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలు ఆయన్ను మరిన్ని కష్టాల్లోకి నెట్టాయి.


తమను తొలగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన అనంతరం శుక్రవారం రాత్రి సమయంలో వారిద్దరూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఆయన అధికారిక నివాసం ‘7, రేస్‌కోర్స్ రోడ్’లో విడివిడిగా కలిసి రాజీనామా లేఖలు సమర్పించారు. ‘అవును, నేను రాజీనామా సమర్పించాను’ అని ఆ తర్వాత ప్రధాని నివాసం బయట బన్సల్ విలేకరులకు వెల్లడించారు. బన్సల్, అశ్వనీకుమార్ రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపుతున్నట్టు ప్రధాని కార్యాలయ అధికార ప్రతినిధి వెల్లడించారు.

ఆరోపణలపై సత్వర విచారణ జరుగుతుందని ఆశిస్తున్నట్టు బన్సల్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రైల్వే బోర్డు సభ్యుడు మహేశ్‌కుమార్‌కి లాభసాటి పదవి ఇప్పించేందుకు తన మేనల్లుడు విజయ్ సింగ్లా బేరసారాలు సాగించిన విషయం తనకు తెలియదని అందులో చెప్పుకొచ్చారు. ‘అయినా తప్పుకోవడమే సరైనదని భావించాను’ అని తెలిపారు. ఇక, అనవసర వివాదానికి తెర దించేందుకే రాజీనామా చేస్తున్నట్టు అశ్వనీకుమార్ తన లేఖలో వివరించారు. ‘‘నాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఎలాంటి తీవ్ర విమర్శలూ చేయలేదు. అయినా సరే, ఏదో తప్పు జరిగిందన్న అభిప్రాయానికి అడ్డుకట్ట వేయదలచాను’’ అని పేర్కొన్నారు. ఈ మొత్తం ఉదంతంపై కేంద్రం శనివారం బహుశా ఒక ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు.

అయితే... మంత్రుల రాజీనామా చేయాలన్న విపక్షాల డిమాండ్‌ను ఇంతకాలం పట్టించుకోని కాంగ్రెస్, ఎట్టకేలకు వారిని తప్పించినా జరగాల్సిన నష్టమంతా ఇప్పటికే జరిగిపోయిందని పరిశీలకులకు వ్యాఖ్యానిస్తున్నారు. వ్రతం చెడ్డా ఫలం దక్కని చందంగా కాంగ్రెస్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందంటున్నారు. అంతేగాక అశ్వనీకుమార్‌ను తప్పించడం మన్మోహన్‌కు సుతరామూ ఇష్టం లేదని, ఈ విషయమై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. విషయం అశ్వనీతో ఆగబోదని, బొగ్గు కుంభకోణం కేసు అంతిమంగా తన మెడకు కూడా చుట్టుకుంటుందని మన్మోహన్ భావిస్తున్నట్టు సమాచారం.

కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని ఆశించి భంగపడ్డ కేంద్ర కార్మిక మంత్రి మల్లికార్జున ఖర్గేను బుజ్జగించడంలో భాగంగా ఆయనకు రైల్వే శాఖ బాధ్యతలు అప్పగిస్తారని భావిస్తున్నారు. ఖర్గే తన మద్దతుదారులకు స్వయంగా ఈ మేరకు చెప్పారంటున్నారు. యూపీఏ-2 హయాంలో అవినీతి ఆరోపణలపై మంత్రులు రాజీనామా చేయడం కొత్తేమీ కాదు. కాంగ్రెస్‌కు చెందిన వీరభద్రసింగ్, శశి థరూర్‌లతో పాటు యూపీఏ భాగస్వామిగా చిరకాలం కొనసాగిన డీఎంకేకు చెందిన దయానిధి మారన్, ఎ.రాజా కూడా గతంలో అవినీతి ఆరోపణలపై మంత్రి పదవుల నుంచి తప్పుకున్నారు.

రోజంతా హైడ్రామా
బన్సల్, అశ్వనీల రాజీనామాకు ముందు శుక్రవారం రోజంతా హస్తినలో నాటకీయ పరిణామాలే చోటుచేసుకున్నాయి. వారి రాజీనామాకు కొన్ని గంటల ముందే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని నివాసానికి వచ్చి ఆయనతో చాలాసేపు మంతనాలు సాగించారు. అశ్వనీకుమార్ చర్యను సాక్షాత్తూ సుప్రీంకోర్టే తప్పుబట్టినా, బన్సల్ మేనల్లుడు రూ.90 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా సీబీఐకి దొరికినా, కుటుంబీకుల పట్ల ఆయన ఆశ్రీత పక్షపాతం చూపారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నా వారిద్దరినీ కొనసాగిస్తుండటంపై కాంగ్రెస్‌లో కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న వైనం ప్రస్తావనకు వచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత నాలుగేళ్లలో లెక్కలేనన్ని కుంభకోణాలతో కాంగ్రెస్ ప్రతిష్ట పాతాళాన్నంటిన నేపథ్యంలో ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలు తీసుకోక తప్పదన్న భావన వ్యక్తమైంది.

వాటిలో భాగంగా మంత్రులిద్దరినీ తప్పించడం అనివార్యమని సోనియా, మన్మోహన్ నిర్ణయించారు. ఆ తర్వాత నుంచి, మంత్రులు వచ్చి రాజీనామా పత్రాలు సమర్పించే దాకా ప్రధాని ఇంట చెప్పలేనంత రాజకీయ హడావుడి కొనసాగింది. కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ తదితరులు మన్మోహన్ వద్దకు వచ్చి వెళ్లారు. అవినీతి ఆరోపణలు వస్తే ఎవరినీ సహించబోమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి భక్తచరణ్ దాస్ శుక్రవారం మధ్యాహ్నం వ్యాఖ్యానించడంతోనే.. బన్సల్‌కు పదవీచ్యుతి తప్పదన్నది స్పష్టమైపోయింది. బన్సల్, అశ్వనీలకు ఉద్వాసన నేపథ్యంలో త్వరలో కేంద్ర మంత్రివర్గాన్ని వచ్చే వారం పునర్ వ్యవస్థీకరిస్తారని తెలుస్తోంది. ఈ అంశంపై సోనియా, మన్మోహన్ ఆదివారం సమావేశమవుతున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad