సిట్టింగులకు సీటు ఊస్టింగేనా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 16, 2019

సిట్టింగులకు సీటు ఊస్టింగేనా?

తెలుగుదేశం పార్టీ తరఫున ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న దళిత ఎమ్మెల్యేల్లో చాలామందికి ఈసారి సీటు హుళక్కేనని తెలుస్తోంది. ఈసారి సీటు దక్కనివారి జాబితాలో విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం, రాజోలు, గన్నవరం ఎమ్మెల్యేలు ఐతాబత్తుల ఆనందరావు, గొల్లపల్లి సూర్యారావు, పులపర్తి నారాయణమూర్తి, పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు, చింతలపూడి, గోపాలపురం ఎమ్మెల్యేలు జవహర్‌, పీతల సుజాత, ముప్పిడి వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లాలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, గుంటూరు జిల్లాలో తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌, చిత్తూరు జిల్లాలో సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య, అనంతపురం జిల్లాలో శింగనమల ఎమ్మెల్యే యామినీబాల తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా వేమూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క నక్కా ఆనందబాబుకే మాత్రమే ఈసారి సీటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. నక్కాకు సీటు దక్కడం వెనుక చంద్రబాబు సామాజికవర్గానికే చెందిన తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రల మద్దతు ఉండటమే కారణమని సమాచారం.

దళిత ఎమ్మెల్యేలకు టిక్కెట్లు కేటాయించకపోవడానికి కారణమిదేనా?
ఆయా నియోజకవర్గాల్లో దళిత నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేయడం, తన చెప్పుచేతల్లో ఉండేవారికి సీట్లు కేటాయించడమే విధివిధానాలుగా పెట్టుకున్న సీఎం చంద్రబాబు వీరి స్థానాల్లో కొత్తవారికి అవకాశం కల్పించనున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా టీడీపీలోని అసమ్మతి నేతలు స్వయంగా చంద్రబాబు ముందే భారీ బలప్రదర్శనలు చేస్తున్నారు. వారికి సీట్లిస్తే చిత్తుచిత్తుగా ఓడిస్తామంటున్నారు. తమలో ఎవరికిచ్చినా కష్టపడి గెలిపించుకుంటామని, ప్రస్తుత ఎమ్మెల్యేలకు మాత్రం ఇవ్వొద్దని హెచ్చరిస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వొద్దంటూ ఆయా నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, వీరికి సీట్లిస్తే పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమేనని అధినేతకు తమ మనసులో మాటను చెబుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లిస్తే ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ నెత్తిన పాలు పోసినట్లేనని అంటున్నారు. దళిత నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబుకు అసమ్మతి నేతల పోరు చక్కగా కలిసి రావడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఝలక్‌ ఇవ్వనున్నారు.

ఇప్పటివరకు దళితులకు ఒక్క సీటూ ఖరారు చేయని చంద్రబాబు
ఇప్పటికే దాదాపు తన సామాజికవర్గానికి చెందిన అందరూ ఎమ్మెల్యేలకు సీట్లు ఖరారు చేసిన చంద్రబాబు దళితులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల మాత్రం ఒక్కరికీ సీటు ఖరారు చేయకపోవడం గమనార్హం. వాస్తవానికి మొదటి నుంచి చంద్రబాబు దళిత నాయకత్వాన్ని ఎదగనీయలేదు. అనేక సాకులు చెప్పి దళిత మంత్రులైన రావెల కిశోర్‌ బాబు, పీతల సుజాతలను అత్యంత అవమానకరంగా మంత్రివర్గం నుంచి తొలగించిన తీరును దళితులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, నారా లోకేశ్‌లపై ఎవరి మీద లేనంత స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చినా చంద్రబాబు చర్యలు తీసుకోలేదని, వారు చంద్రబాబు సామాజికవర్గం కావడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. అంతేకాకుండా పలుమార్లు దళితులపై సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి ఆదినారాయణరెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య చేసిన దారుణ వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.

పార్టీ ఫిరాయించిన దళిత ఎమ్మెల్యేలకూ సీట్లు గల్లంతే..
వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి చంద్రబాబు ప్రలోభాలకు ఆశపడి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, వైఎస్సార్‌ జిల్లా బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌ కుమార్‌, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌ రాజులకు సీటు కష్టమేనని తెలుస్తోంది. ఉప్పులేటి కల్పన స్థానంలో ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య.. లేదంటే వేరే ఎవరినైనా పోటీకి దింపే యోచనలో ఉన్నారు. ఇక.. కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీకి అయితే పార్టీ మారిన కొత్తల్లోనే టీడీపీ ట్రేడ్‌మార్క్‌ శైలి ఏమిటో అర్థమైంది. తాజాగా అదే జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కుటుంబం టీడీపీలో చేరడంతో మణిగాంధీకి కష్టాలు రెట్టింపయ్యాయి. కోట్ల తన అనుచరుడికి కోడుమూరు సీటు ఇప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో మణిగాంధీ కక్కలేని.. మింగలేని దుస్థితిలో ఉన్నారు. అదేవిధంగా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌ కుమార్‌ పరిస్థితీ ఇలాగే ఉంది. గతంలో మంత్రిగా పనిచేసిన బల్లి దుర్గాప్రసాద్‌ లేదా మున్సిపల్‌ చైర్మన్‌ దేవసేనకు సీటు ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారు. యర్రగొండపాలెంలో డేవిడ్‌రాజుకు బదులుగా ఐఏఎస్‌ అధికారి దేవానంద్‌/మాజీ ఎమ్మె‍ల్యే విజయ్‌కుమార్‌కు సీటు దక్కే ఛాన్స్‌ ఉంది. వాస్తవానికి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేటప్పుడు అన్ని రకాల ప్యాకేజీలతోపాటు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు వీరందరినీ కూరలో కరివేపాకులా వాడుకుని వదిలేయడంతో వారంతా రోడ్డున పడ్డారు.


No comments:

Post a Comment

Post Bottom Ad