గుంటూరు జిల్లాలో ఒక్క సీటూ కాపులకు ఇవ్వని చంద్రబాబు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, February 25, 2019

గుంటూరు జిల్లాలో ఒక్క సీటూ కాపులకు ఇవ్వని చంద్రబాబు

కాపులకు తామే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చామని, ఇస్తున్నామని చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లాలో ఆ సామాజికవర్గానికి జెల్లకొట్టారు. గుంటూరు జిల్లాలో ఉన్న 17 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్క సీటును కూడా కాపులకు కేటాయించకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో ఒక్క బాపట్ల అసెంబ్లీ సీటును మాత్రమే కేటాయించిన ఆయన ఈసారి దానికి కూడా ఎగనామం పెట్టారు. ఈ స్థానం నుంచి దాదాపు వేరే అభ్యర్థిని దింపడానికి రంగం సిద్ధం చేశారు.

రాష్ట్రంలోనే తూర్పుగోదావరి జిల్లా తర్వాత అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న గుంటూరు జిల్లాలో కాపులకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంపై ఆ సామాజికవర్గ నేతల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రతి నియోజకవర్గంలో కనీసం 30 వేలకు తగ్గకుండా కాపు ఓటర్లు ఉన్నారు. టీడీపీలో కాపు నేతలకు కూడా కొదవలేదు. గుంటూరు జిల్లాలోనే చందు సాంబశివరావు, అన్నం సతీశ్ ప్రభాకర్, దాసరి రాజా మాస్టార్ వంటి కాపు నేతలు ఉన్నారు. అయితే ఒక్కరంటే ఒక్కరికి కూడా టికెట్ కేటాయించలేదు.

అదే చంద్రబాబు సామాజికవర్గం నుంచి గుంటూరు జిల్లాలో ఏకంగా ఏడుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెనాలి, పొన్నూరు, చిలకలూరిపేట, వినుకొండ, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు నుంచి కమ్మ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరందరికీ వచ్చే ఎన్నికల్లోనూ సీట్లు దక్కనున్నాయి. అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలు గుంటూరు, నరసరావుపేటలోనూ కమ్మ ఎంపీలే ఉన్నారు. కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చి కాపులను అన్ని విధాలా ఆదుకుంటున్నామంటున్న చంద్రబాబు ఆ సామాజికవర్గం అత్యధికంగా ఉన్న గుంటూరు జిల్లాలో ఒక్క సీటూ కేటాయించకపోవడంపై కాపుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad