'సాక్షి' పత్రిక కథనంలో నిజమెంత? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, February 22, 2019

'సాక్షి' పత్రిక కథనంలో నిజమెంత?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక ఫిబ్రవరి 22న తన మొదటి పేజీలో సంచలన కథనాన్ని ప్రచురించింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మధ్య మరోమారు రహస్య చర్చలు జరిగాయని, వచ్చే ఎన్నికల్లో మరోమారు ఇరువురూ కలసి పోటీ చేయడానికి మొగ్గుచూపుతున్నారని సాక్షి రాసుకొచ్చింది. వాస్తవానికి పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి వామపక్షాలు (సీపీఎం, సీపీఐ)తో మినహా ఏ పార్టీతో పొత్తు ఉండదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.

అయితే మూడు పార్టీలు (తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్) పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయని ఈ క్రమంలో అధికార పార్టీ తెలుగుదేశంతోపాటు తమకు నష్టం జరుగుతుందని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం తమకే రావాలని ఆ పార్టీ భావిస్తోంది. పవన్ కల్యాణ్ పార్టీ పోటీలో ఉంటే ఇది సాధ్యం కాదు కాబట్టి జనసేన పార్టీ.. టీడీపీతోనే ఉందని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ రహస్య మిత్రులని ఆ పార్టీ నేతలు, మీడియా తరచూ ఆరోపిస్తోంది. ఈ మాటలు ఎక్కువమంది విశ్వసిస్తే పవన్ కల్యాణ్ ను చంద్రబాబు పార్టనర్ గానే జనం భావించి ఓట్లన్నీ తమకే వేస్తారని వైఎస్సార్సీపీ మాస్టర్ ప్లాన్.

ఈ నేపథ్యంలోనే సాక్షి పత్రిక తన కథనాన్ని వండివార్చింది. చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు మధ్య పారిశ్రామివేత్త లింగమనేని రమేశ్ మధ్యవర్తిగా ఉన్నారని చెబుతోంది. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కు 25 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు స్థానాలు ఇవ్వడానికి చంద్రబాబు నిర్ణయించారని, దీనికి పవన్ కల్యాణ్ కూడా అంగీకరించారని అంటోంది. పొత్తు కుదిరిపోయిందని అయితే ఏయే స్థానాలు జనసేనకు ఇవ్వాలి? పోటీ చేసే అభ్యర్థులు ఎవరనే చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయని రాసుకొచ్చింది. ఈ కథనాన్ని అటు జనసేన, ఇటు టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఓటమి భయంతోనే వైఎస్ జగన్ ఇలాంటి కథనాలు రాయిస్తున్నాడని మండిపడుతున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad