రాహుల్ గాంధీ ఆంధ్రా పర్యటనతో ఆ పార్టీకి లాభం ఉందా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, February 24, 2019

రాహుల్ గాంధీ ఆంధ్రా పర్యటనతో ఆ పార్టీకి లాభం ఉందా?

పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్ముకోవాల్సి రావడం కంటే మరో బాధ లేదు. ఇప్పుడు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రాలో ఇదే. 2004 నుంచి 2014 ఏప్రిల్ వరకు అధికారంలో ఉన్న ఆ పార్టీకి తర్వాత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా లేదంటే అది ఆశ్చర్యం కాక మరేమిటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కు గత ఎన్నికల్లో దిమ్మతిరిగే తీర్పిచ్చారు ఏపీ ఓటర్లు. రాష్ట్రవ్యాప్తంగా ఒకరిద్దరుకు తప్ప ఎవరికీ డిపాజిట్లు రాలేదంటే ఆ పార్టీ ఎంత దారుణంగా పతనమయిందో అర్థం చేసుకోవచ్చు.

ఆ దెబ్బతో చిన్నాచితక కాంగ్రెస్ నాయకులతోపాటు మేరునగదీరుల్లాంటి పెద్ద నేతలు సైతం వేరే పార్టీల్లో చేరిపోవాల్సి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్, కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు లాంటి వారు మినహా ప్రధాన నేతలంతా టీడీపీ, వైఎస్సార్సీపీల్లో చేరిపోయారు. కొంతమంది రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉంటారనుకున్న చిరంజీవి కూడా ఆ పార్టీకి చెయ్యి ఇచ్చినట్టే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో రాహుల్ గాంధీ పర్యటన ఆసక్తిని రేపింది.

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం చేసుకుని తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించిన రాహుల్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తాము పట్టించుకోబోమని చెప్పారు. అయితే రాహుల్ గాంధీ మాటలు నమ్మి ఆ పార్టీకి పట్టం కట్టడానికి ఓటర్లు సిద్ధంగా లేరు. ఆ పార్టీ ఇప్పట్లో కోలుకోవడం అసాధ్యం. భవిష్యత్ లోనూ వెలుగులీనుతుందని ఆశించడం కూడా అత్యాశే.

ఎందుకంటే.. రాహుల్ సభ నిర్వహించాక కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీల్లోకి చేరికలు ఆగడం లేదు. నేడో రేపో అరకు మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా తిరుపతిలో రాహుల్ నిర్వహించిన సభ అట్టర్ ప్లాప్ అయింది. జనాలు లేక సభ వెలవెలపోయింది. మీడియాలోనూ రాహుల్ పర్యటనకు పెద్ద ప్రాధాన్యత దక్కలేదు. రాహుల్ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పినా ఆయనను నమ్మడానికి ఓటర్లు సిద్ధంగా లేరు. ఇప్పటికే వివిధ సంస్థలు ప్రకటించిన సర్వేల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదని తేలింది. ఈ నేపథ్యంలో రాహుల్ పర్యటన వల్ల ఏపీ కాంగ్రెస్ కు ఎలాంటి ఉపయోగమూ కనిపించడం లేదు. 

No comments:

Post a Comment

Post Bottom Ad