చంద్రబాబు 'బలిజ మంత్రం' ఫలిస్తుందా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, February 23, 2019

చంద్రబాబు 'బలిజ మంత్రం' ఫలిస్తుందా?

తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం బలిజ మంత్రం ఫలిస్తున్నారు. రాయలసీమలో అత్యధికంగా ఉన్న బలిజలకు ప్రాధాన్యతనిచ్చి వారి ఓట్లను కొల్లగొట్టేందుకు వ్యూహం పన్నుతున్నారు. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ సంఖ్యలో ఉన్న బలిజల ఓట్లు పొందితే రాయలసీమలో అత్యధిక సీట్లు సాధించవచ్చని నమ్ముతున్నారు.

ఈ నేపథ్యంలోనే కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడిని ప్రకటించారు. ఈ స్థానానికి పలువురు పోటీ పడుతున్నప్పటికీ వారిని కాదని బలిజ సామాజికవర్గానికి చెందిన చెంగల్రాయుడిని ఎంపిక చేశారు. అదేవిధంగా కడప జిల్లాలోనే రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గానికి మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు పోటీ పడ్డప్పటికీ ఆయనకు సీటు ఇవ్వలేదు. సుగవాసి కూడా బలిజ సామాజికవర్గమే. అయితే సుగవాసి కుమారుడు ప్రసాద్ కు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా అవకాశం కల్పించారు. అంతేకాకుండా రాయచోటి మున్సిపాలిటీతోపాటు రెండు మండలాల పార్టీ బాధ్యతలు కూడా అప్పగించారు. పార్టీకి సంబంధించి ఏ నిర్ణయమైనా సుగవాసి కుటుంబాన్ని సంప్రదించాలని ఎమ్మెల్యే అభ్యర్థి రమేశ్ కుమార్ రెడ్డికి సూచించారు.

అదేవిధంగా రాజంపేట పార్లమెంటరీ స్థానానికి మాజీ ఎంపీ డీకే ఆదికేశవులునాయుడు సతీమణి, చిత్తూరు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభను పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నారు. రాజంపేట నియోజకవర్గ పరిధిలో అత్యంత బలమైన బలిజ సామాజికవర్గానికి చెంది ఉండటంతోపాటు అర్థ, అంగ బలాలు పుష్కలంగా ఉండటంతో ఆమె వైపు చంద్రబాబు మొగ్గుచూపుతున్నారు. ఇలా బలిజ సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారంతా జనసేన పార్టీకే జైకొట్టే అవకాశం కనిపిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలంగా ఉండటంతోపాటు తమ కులస్తుడైన పవన్ కల్యాణ్ కే ఓటేయడానికి బలిజలు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వల్లిస్తున్న బలిజ మంత్రం ఫలించే అవకాశం కనిపించడం లేదు. 

No comments:

Post a Comment

Post Bottom Ad