కిశోర్ చంద్ర దేవ్ చేరికతో టీడీపీకి లాభమెంత? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, February 25, 2019

కిశోర్ చంద్ర దేవ్ చేరికతో టీడీపీకి లాభమెంత?

నాలుగుసార్లు పార్వతీపురం, ఒకసారి అరకు లోయ ఎంపీగా గెలిచిన మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్ర్ దేవ్ చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేరిక వల్ల టీడీపీకి ఎలాంటి లాభం లేదంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. దీనికి పలు కారణాలను ఉదహరిస్తున్నారు.

అవేమిటంటే.. గత ఎన్నికల్లో అరకు (ఎస్టీ) పార్లమెంటరీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కిశోర్ డిపాజిట్ కూడా సాధించలేకపోయారు. కనీసం ద్వితీయ స్థానంలో కూడా నిలబడలేకపోయారు. ఆయన పార్వతీపురం నుంచి గెలిచిన మూడుసార్లు ఇందిరాగాంధీ హవాలోనే అంటే 1977, 1980, 1984లోనే విజయం సాధించారు. ఆ తర్వాత వరుస ఓటములే పలకరించాయి. మళ్లీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హవాలో 2004లో పార్వతీపురం నుంచి, 2009లో పార్వతీపురం పార్లమెంటరీ నియోజకవర్గం రద్దవడంతో అరకు ఎంపీగా పోటీ చేసి గెలిచారు.

కొండ దొర (ఎస్టీ) సామాజికవర్గానికి చెందిన కిశోర్ చంద్ర దేవ్ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండరని, ఆయన నివాసం ఢిల్లీలోనేనని, అధిష్టానం పెద్దలతో సత్సంబంధాలు, గిరిజన నేతనని చెప్పుకుంటూ సీటు తెచ్చుకుంటుంటారని విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతల వ్యవహార శైలి ఇలాగే ఉంటుందనేది తెలిసిన సంగతే. నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు ఉన్నా, లేకపోయినా పార్టీ అధిష్టానం ఆశీస్సులు ఉంటే చాలని భావిస్తుంటారు. ఆ పార్టీ గాలి వీస్తే గెలవడం, లేదంటే ఓడిపోవడం జరుగుతుంటుంది.

కేంద్ర మంత్రిగా పనిచేసినా కిశోర్ చంద్ర దేవ్ గిరిజనుల అభివృద్ధికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదని వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏ రోజూ తమకు అందుబాటులో లేరని, ఏ పని మీద ఆయన కార్యాలయానికి వచ్చినా అందుబాటులో లేరని, ఢిల్లోలోనే ఉన్నారని ఆయన కార్యాలయ సిబ్బంది చెప్పేవారని గిరిజనులు అంటున్నారు. అంతేకాకుండా మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులివ్వడం, పోలీసులతో గిరిజనులను అణచివేయడం వంటి చర్యలు ఆయనకు ఇబ్బందికరంగా మారనున్నాయి.

గత ఎన్నికల్లో అరకు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తపల్లి గీత విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె టీడీపీలోకి ఫిరాయించారు. మళ్లీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్తగా పార్టీని స్థాపించారు. వచ్చే ఎన్నికల్లో అరకు నుంచి టీడీపీ తరఫున వైరిచర్ల కిశోర్ చంద్ర దేవ్, వైఎస్సార్సీపీ తరఫున పరీక్షిత్ రాజు పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కిశోర్ చంద్ర దేవ్ చేరిక వల్ల టీడీపీకి ఎలాంటి లాభం జరిగే అవకాశం కనిపించడం లేదు. 

No comments:

Post a Comment

Post Bottom Ad