బోడిగుండుకి, మోకాలికి ముడేస్తున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, February 25, 2019

బోడిగుండుకి, మోకాలికి ముడేస్తున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ!

'కొత్త పలుకు' శీర్షికతో ప్రతి ఆదివారం ఎడిట్ పేజీలో తనదైన శైలిలో ఒక వ్యాసం రాస్తుంటారు.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. వాస్తవాలకు చాలా దూరంగా, చంద్రబాబుకు అనుకూలించేలా మాత్రమే అవి రాస్తుంటారని విమర్శకులు అంటుంటారు. తాజాగా ఈ వారం రాసిన కొత్త పలుకులోనూ చంద్ర భజన తప్ప మరేమీ లేదు. చంద్రబాబును ఓడించడానికి హైదరాబాద్ సాక్షిగా కుట్రలు జరుగుతున్నాయని, ఒక్కడిని ఓడించడానికి అందరూ ఏకమవుతున్నారని తీవ్రంగా ఆందోళన చెందారు.. చంద్రజ్యోతి అధినేత.

హైదరాబాద్ లో ఆస్తులున్న టీడీపీ నేతలను సామదాన దండోపాయాలు ఉపయోగించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేలే చూస్తున్నారని, రిటైర్ట్ అధికారులు, ఒక మాజీ న్యాయమూర్తి, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితరులంతా చంద్రబాబును ఓడించడానికి కంకణం కట్టుకున్నారని రాధాకృష్ణ ఆ వ్యాసంలో ఆరోపించారు. ఇది బాగానే ఉన్నా ఒక్క విషయం అయితే రాధాకృష్ణ మరిచిపోయారు. కేసీఆర్ ను ఓడించడానికి తెలంగాణ ప్రజా సమితి అధినేత కోదండరాంను, కాంగ్రెస్ పార్టీని, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మంద కృష్ణమాదిగను, సీపీఐ పార్టీని ఏకం చేసి, తాను కూడా కూటమిలో చేరి భారీ ఎత్తున డబ్బులు వెదజల్లి ఓట్లు కొనుగోలు చేయడానికి చంద్రబాబు ప్రయత్నించిన సంగతిని రాధాకృష్ణ మరిచిపోయినట్టున్నారు.

చంద్రబాబు చేస్తే చాణక్యం అని పొగిడి ఇప్పుడు అదే నోటితో ఒక్కడిపైకి వందమంది తయారవుతున్నారని బాధపడిపోతున్నారు. శతకోటి లింగాల్లో ఒక బోడిలింగంలాగా 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును దించడానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీనే కుట్రపన్నుతారంటూ హాస్యాన్ని పండిస్తున్నారు.  ముఖ్యంగా తమ కమ్మ సామాజికవర్గానికి చెందిన దాసరి జై రమేశ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేశ్ వైఎస్సార్సీపీలో చేరడాన్ని రాధాకృష్ణ సహించలేకపోతున్నారు. చివరకు వైఎస్ జగన్ కుటుంబ మిత్రుడైన కమ్మ సామాజికవర్గ హీరో నాగార్జున.. జగన్ ను కలిసినా దానికి కూడా వేరే కథ ఉందని చెబుతున్నారు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ వివాదంలో ఉందని, ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందని, జగన్ కు మద్దతు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని కేసీఆర్ ప్రభుత్వం ఆదేశించబట్టే నాగార్జున.. జగన్ ను కలిసి ఉంటారని రాధాకృష్ణ తనదైన భాష్యం చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలోనూ, పలుమార్లు నాగార్జున.. జగన్ ను కలిశారు. కానీ ఇప్పుడే కలిసినట్టు రాధాకృష్ణ అవాస్తవాలు రాస్తున్నారు.

వాస్తవానికి.. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ వివాదం ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఇప్పుడు దానిపై ఎలాంటి వివాదం లేదు. తన వ్యాపార ప్రయోజనాల కోసం ఎవరితోనైనా సఖ్యతగా ఉండగల నాగార్జున టీఆర్ఎస్ గవర్నమెంట్ మొదటిసారి అంటే 2014లోనే దాన్ని పరిష్కరించుకున్నారు. ఆ వివాదం కూడా పెద్దదేమీ కాదు. చెరువులో కొంత బాగం పూడ్చి నిర్మాణాలు చేశారనేది వివాదం. దాన్ని తెలివిగా ఇప్పుడు తెరమీదకు తెచ్చిన వేమూరి రాధాకృష్ణ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నారు.

ఇప్పటికే పచ్చ పత్రిక అంటూ జనబాహుళ్యంలోకి చొచ్చుకెళ్లిపోయిన ఆంధ్రజ్యోతి ఇలాంటి కథనాల ద్వారా అంతకంతకూ విశ్వసనీయతను కోల్పోతోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అయితే రాధాకృష్ణను ఒక ఆట ఆడుకున్నారు. బూతు జ్యోతి, బూతురత్న అంటూ ట్విట్టర్ లో ఏకిపారేశారు. తాను రాస్తే అది వాస్తవం, ఇతర పత్రికలు రాస్తే చంద్రబాబుపై కుట్ర జరుగుతోందని గగ్గోలు పెట్టడం, నమ్మించడానికి ప్రయత్నించడం రాధాకృష్ణకు మాత్రమే చేతనైన విద్య అని అందరూ అనే మాట. ఇప్పటికైనా చంద్రభజన ఆపేసి ప్రజల పక్షాన ఉంటే ఆయనకే మంచిది. లేదంటే కొద్ది కాలంలోనే వార్త పత్రికలా కాలగమనంలో కలిసిపోక తప్పదు. 

No comments:

Post a Comment

Post Bottom Ad