వైసీపీ అభ్యర్థుల మార్పు.. జగన్ స్ట్రాటజీ ఏంటి? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 04, 2018

వైసీపీ అభ్యర్థుల మార్పు.. జగన్ స్ట్రాటజీ ఏంటి?

గత కొన్నాళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో  పలు మార్పులు జరుగుతూ ఉన్నాయి. వివిధ నియోజకవర్గాల్లో అనూహ్యంగా కొత్త ఇన్ చార్జిలు రావడం, పాత వాళ్ల బదులు వీళ్లు అభ్యర్థులుగా ప్రకటనలు పొందుతూ ఉండటం జరుగుతూ ఉంది. ఇదే అదునుగా టీడీపీ అనుకూల మీడియా కూడా రెచ్చిపోతూ ఉంది. వైసీపీలో అనూహ్య మార్పులు జరిగిపోతూ ఉన్నాయని.. ఆ పార్టీలో కలకలం మొదలైందన్నట్టుగా వార్తలు రాస్తున్నాయి. అసలుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరగకపోయినా.. ఏదో జరిగిపోతోందని వార్తలు రాసే నైజం ఉంది తెలుగుదేశం అనుకూల మీడియాకు. అలాంటి కొన్ని మార్పులు జరుగుతున్నాయంటే.. ఏదో అయిపోతోందని ఈ మీడియా వర్గాలు ప్రచారం చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు.

ఇంతకీ జగన్ ఏ మార్పులు చేస్తున్నారు? ఎలాంటి మార్పులు చేస్తున్నారు? ఎందుకు మార్పులు చేస్తున్నారు? అనే అంశాల గురించి తెలుగుదేశం అనుకూల మీడియా కథలను పక్కన పెట్టి.. క్షేత్ర స్థాయిలో పరిస్థితుల గురించి పరిశీలించి చూస్తే.. జగన్ నిర్ణయాలు వ్యూహాత్మకమైనవిగా, సబబైనవిగా స్పష్టం అవుతుంది. 

అందుకు ఉదాహరణలను తీసుకుంటే... గుంటూరు వెస్ట్ సీటు విషయంలో జరిగిన మార్పును ముందుగా పరిశీలించవచ్చు. అక్కడ మొన్నటి వరకూ ఇన్ చార్జిగా ఉండిన లేళ్ల అప్పిరెడ్డిని పక్కన పెట్టి ఏసురత్నాన్ని అభ్యర్థిగా ప్రకటించారు జగన్ మోహన్ రెడ్డి. దీంతో బ్రహ్మాండం బద్దలైందని.. లేళ్ల వైసీపీని వీడతాడని.. పచ్చ మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇక్కడ అసలు విషయాన్ని అవి మరుగున పడేస్తున్నాయి.

అదేమిటంటే.. గత ఎన్నికల్లో లేళ్ల తెలుగుదేశం అభ్యర్థి మోదుగుల చేతిలో చిత్తుగా ఓడిపోయారు. కనీసం పోరాడిన దాఖలాలు లేవు. గుంటూరు జిల్లాలో మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడే టీడీపీ మంచి మెజారిటీ సాధించింది. ఇక రేపైనా లేళ్ల అప్పిరెడ్డి మోదుగులకు పోటీ ఇస్తాడా? అంటే గట్టిగా ఔనని చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో... వివిధ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని జగన్ అభ్యర్థిని మార్చారు. ఇక లేళ్ల ఇప్పుడేదో హడావుడి చేయవచ్చు గాక.. ఆయన వైసీపీని వీడే అవకాశాలు మాత్రం లేవు. ఎందుకంటే.. లేళ్లకు ఒక గుర్తింపును ఇచ్చింది జగన్ మోహన్ రెడ్డి. దాన్ని కాదని ఆయన ఎక్కడకు వెళ్లడు.

ఇక చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటిని ఎదుర్కొనడానికి వారి సామాజికవర్గానికే చెందిన, ఆర్థిక బలం ఉన్న అభ్యర్థి దొరకడం వైసీపీకి ప్లస్ పాయింటే. ఇదే సమయంలో మర్రి రాజశేఖర్ ను నిర్లక్ష్యం చేయడం లేదు జగన్ మోహన్ రెడ్డి. వారికి తగిన ప్రాధాన్యతను ఇస్తానని జగన్ హామీని ఇచ్చారు.

రాజకీయంలో ఒక వ్యూహం ఉండటం ఎంత ప్రధానమో, ఎప్పటికప్పుడు వ్యూహాన్ని సమీక్షించుకోవడం కూడా అంతే ప్రధానమే. ఇప్పుడు జగన్ అదే చేస్తున్నారు. పాత వాళ్లనూ, కొత్త వాళ్లనూ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఈ వ్యవహారాన్ని ఉపయోగించుకుని వ్యతిరేక మీడియా ఏదో ప్రచారం చేయవచ్చు కానీ.. జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగానే వెళ్తున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad