పవన్ కల్యాణ్.. పగటి కలలు కంటున్నాడా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 04, 2018

పవన్ కల్యాణ్.. పగటి కలలు కంటున్నాడా?


మొన్నటి వరకూ ‘నేనే సీఎం..’ అన్న జనసేన అధిపతి ఇప్పుడు వరస మార్చాడు. ‘నేనే కింగ్ మేకర్’ అంటున్నాడు. వరసగా వివిధ కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..కింగ్ అవుతా అనే దశ నుంచి కింగ్ మేకర్ అవుతా.. అనే దశకు వచ్చాడు. పవన్ కల్యాణ్ ఆశలన్నీ ఇప్పుడు కింగ్ మేకర్ పొజిషన్ మీదే ఉన్నట్టుగా ఉన్నాయి. అయితే.. ఇవైనా నిజం అవుతాయా? అనేది ప్రశ్నార్థకం. ప్రస్తుతానికి అయితే పవన్ కల్యాణ్ పగటి కలలు కంటున్నాడు. వాటిని బయటకే చెబుతూ ఉన్నాడు.

కర్ణాటకలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన హంగ్ తరహా పరిస్థితులు ఏపీలో వస్తాయని, అప్పుడు తన మద్దతే కీలకం అవుతుందని.. టీడీపీ, వైసీపీల్లో ఎవరు అధికారంలోకి రావాలన్నా.. తన మద్దతే అవసరం అవుతుందని పవన్ భావిస్తున్నాడు. అయితే.. కర్ణాటక పరిస్థితుల గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉంటే..  ఏపీలో అలా అవుతుందని జనసేన అధిపతి అనుకోనే అనుకోడు.

కర్ణాటకలో హంగ్ తరహా పరిస్థితులు ఏర్పడింది నిజమే, అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ రాక జేడీఎస్ కింగ్ మేకర్ అయ్యింది. పవన్ కూడా ఏపీలో కుమారస్వామి పాత్ర తనకు దక్కుతుందని ఆశిస్తున్నట్టుగా ఉన్నాడు. కానీ.. కర్ణాటకలో జేడీఎస్ ప్రస్థానానికి, ఏపీలో జనసేన ప్రస్థానానికి చాలా తేడా ఉంది. జేడీఎస్ దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ. ఆ పార్టీకి ఒక సామాజికవర్గం అండగా ఉన్న ఉంది, అంతకు మించి కుమారస్వామి ఒక మాజీ ముఖ్యమంత్రి. కేవలం తన కులం వరకే కాకుండా.. గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేపథ్యంతో కొంత ఇమేజ్ సంపాదించుకున్నాడు. దేవేగౌడ వంటి మాజీ ప్రధాని ఉద్ధండపిండంగా ఆ పార్టీలో ఉన్నాడు.

అంత ఉన్నా.. చివరకు జేడీఎస్ కు దక్కింది కేవలం కింగ్ మేకర్ పాత్ర మాత్రమే. పవన్ దాన్ని సాధించుకోవడానికి ఎంత దూరంలో ఉన్నాడో చెప్పనక్కర్లేదు. జనసేనకు ఇప్పటి వరకూ తాడూబొంగరం లేదు. పవన్ తప్ప.. కనీసం ఎమ్మెల్యేగా నెగ్గగల నేతల మరొకరు ఇప్పటి వరకూ ఆ పార్టీలో కనిపించడం లేదు. పవన్ తీరును గమనించాకా.. ఇతర పార్టీల్లో ఎమ్మెల్యే హోదాల్లో ఉన్న వారు కూడా ఎవరూ జనసేన వైపు రావడానికి సాహసించడం లేదు. వెనుకటికి చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు రాజకీయ వర్గాల నుంచి, ప్రజల నుంచి వచ్చిన స్పందనతో పోలిస్తే... పవన్ కల్యాణ్, జనసేనలకు వస్తున్న స్పందన వందో వంతు కూడా లేదు. అంత స్పందన చిరంజీవి సాధించింది శూన్యం. మరి పవన్ ఏం సాధించగలడు? ముఖ్యమంత్రిని అవుతా అనే దశ నుంచి కింగ్ మేకర్‌నవుతా అనే దశకు వచ్చిన పీకే.. ఇప్పుడు కూడా తను పగటి కలలు కంటున్నానని గుర్తించడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు.

No comments:

Post a Comment

Post Bottom Ad