పవన్ కల్యాణ్ పైన టీడీపీకి ఇంకా ఆశ చావలేదా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 28, 2018

పవన్ కల్యాణ్ పైన టీడీపీకి ఇంకా ఆశ చావలేదా?


ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉత్తరాంధ్ర పర్యటనను విజయవంతంగా ముగించుకున్న పవన్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దెందులూరులో జరిగిన సభలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ వ్యవహార శైలిని చీల్చిచెండాడారు. అయినా ఆ పార్టీ నుంచి, నేతల నుంచి పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ ఘాటు విమర్శలు రావడం లేదు. పైగా, చింతమనేని ప్రభాకరే పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని దెందులూరు నుంచి పోటీ చేస్తే తానే భుజస్కందాలపై పవన్ ను కూర్చోపెట్టి గెలిపిస్తానని చెప్పడం గమనార్హం. పవన్ కర్రుకాల్చి టీడీపీ నేతలకు వాత పెడుతున్నా వారు పవన్ ను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 27 శాతంగా ఉన్న కాపులను దూరం చేసుకుంటే తమకు ఓటమి తప్పదని వారు దిగులు చెందుతుండటమే ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ సీట్లను తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. కాపులు ఎవరికి ఓట్లేస్తే వారు మాత్రమే గెలవగల ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ తో సున్నం పెట్టుకోవడం ఎందుకనే భావనలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ అధిష్టానం కూడా వేచిచూసే ధోరణితోనే ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చెడిన సంబంధాల నేపథ్యంలో పవన్ వచ్చే ఎన్నికల తర్వాత మళ్లీ తమకే మద్దతు ఇస్తాడని చంద్రబాబు భావిస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad