సాగర తీరం పూల వనం : వైభవంగా జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 03, 2014

సాగర తీరం పూల వనం : వైభవంగా జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలు

తీరొక్క పూలతో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను కొలిచిన తెలంగాణ ఆడపడుచులు.. ‘మాయమ్మ లక్ష్మిదేవి చందమామ....పోయి రావే తల్లి చందమామ’ అంటూ బతుకమ్మ తల్లికి వీడ్కోలు పలికారు. సద్దుల బతుకమ్మ నిమజ్జన ఘట్టం హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై మహాఘనంగా ముగిసింది. నూతన రాష్ర్టానికి తొలి పండుగ కావడం, అదీ తెలంగాణ సాంస్కృతిక సారాన్ని రూపుకట్టే సందర్భం కావడంతో..తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమయింది. సన్నాహాల దశ నుంచి వేడుకల నిర్వహణ దాకా.. ఏమాత్రం ఉత్సవ సందడి తగ్గకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఊరేగింపు నుంచి బతుకమ్మ ఆట దాకా.. ఆసాంతం ఈ శ్రద్ధ కనిపించింది.
ముందుగానే పూలను సిద్ధం చేసింది. దాదాపు 35 వేల టన్నుల పుష్పాలను అందుబాటులో ఉంచింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా, రాష్ట్ర చరిత్రను కళ్లముందుంచేలా.. రాష్ట్ర సాంస్కృతిక శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకొంది. గవర్నర్‌ నరసింహన్‌ సతీమణి విమలా నరసింహన్‌ ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఆడి.. సంబురానికి శోభ తీసుకొస్తే.. తెలంగాణ ప్రభుత్వ అధికార పత్రిక ‘తెలంగాణ’ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించి..అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. భార్య శోభతో కలిసి ఆయన కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు. ఆయన కుమార్తె, ఎంపీ కవిత బతుకమ్మని ఎత్తుకొని ఊరేగింపులో ముందు నడిచారు.
బతుకమ్మల ఊరేగింపు
రంగు రంగుల పూలతో తయారైన బతుకమ్మలతో ట్యాంక్‌బండ్‌ పుష్ప హరివిల్లును తలపించింది. ప్రధాన వేదిక వద్దకు చేరుకోవడానికి ముందుగా మహిళలు పెద్దఎత్తున ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. బృందాలుగా ఏర్పడి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమం కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు 26 వేల బతుకమ్మలను సిద్ధం చేశారు. ఈ క్రమంలో అక్కడకు ఎంపీ కవిత చేరుకున్నారు. వెంట డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి అనుసరించారు. వారి రాకతో సంబురానికి మరింత ఊపు వచ్చింది. కొద్దిసేపు వారక్కడ గడిపారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో.. కవిత, పద్మాదేవేందర్‌ రెడ్డి బతుకమ్మలతో ట్యాంక్‌బండ్‌ దిశగా అడుగులు వేశారు. సంప్రదాయ వస్ర్తాలతో, అందంగా అలంకరించుకొని పది జిల్లాల నుంచి వేల మంది అప్పటికే అక్కడకు వచ్చారు. వారంతా కవితను అనుసరించారు. క్షణాల్లోనే ఆ ప్రాంతం పూల సంద్రాన్ని తలపించింది. వేల బతుకమ్మలతో మహా ఊరేగింపుగా నిమజ్జన ఘట్టం సాగింది. నిమజ్జనం కోసం అధికారులు ఆరు ఘాట్‌లు ఏర్పాటు చేశారు. ముందుగా కవిత తన బతుకమ్మని నిమజ్జనం చేసి.. ఆ క్రతువును ప్రారంభించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad