విజయాలను ప్రసాదించే విజయదుర్గ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 01, 2014

విజయాలను ప్రసాదించే విజయదుర్గ

ఆదిపరాశక్తి అయిన అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి నవరాత్రులనేవి అశేష భక్త జనావళికి లభించిన అమూల్యమైన వరాలుగా చెప్పవచ్చు. ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారు ధరించే వివిధ రూపాలను భక్తులు దర్శిస్తూ ... తరిస్తూ వుంటారు. ఇక పదవరోజున అంటే 'దశమి' రోజున అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా పూజాభిషేకాలు అందుకుంటుంది. ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన పులిహోర ... లడ్డు నైవేద్యంగా సమర్పిస్తూ వుంటారు.
లోకకల్యాణం కోసం తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో తొమ్మిదిమంది రాక్షసులను అమ్మవారు సంహరిస్తుంది. అమ్మవారు సాధించిన విజయానికి గుర్తుగా ఆ తల్లిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే రోజు విజయదశమిగా పిలవబడుతోంది. శ్రవణా నక్షత్రం ... దశమి తిథి కలిసిన రోజే విజయదశమిగా చెప్పబడుతోంది. ఈ రోజున ఆయుధపూజ నిర్వహించడం ప్రాచీనకాలం నుంచి వస్తోంది.
అజ్ఞాతవాస సమయంలో పాండవులు తమ ఆయుధాలను భద్రంగా 'శమీవృక్షం'పై దాచిపెడతారు. తమకి విజయం చేకూరడం కోసం ఆయుధాలను పూజిస్తారు. ఈ కారణంగానే అందరికీ విజయం కలగాలనే ఉద్దేశంతో విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజించడం జరుగుతోంది. ''శమీ శమయతే పాపం శమీ శతృవినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనః '' అంటూ శమీ వృక్షాన్ని పూజిస్తారు.
ఈ రోజున సంధ్యాకాలంలో అమ్మవారు 'అపరాజితాదేవి'గా దర్శనమిస్తుంది. ఈ సమయాన్నే విజయ ముహూర్తమని చెబుతుంటారు. ఈ సమయంలో ప్రారంభించిన ధర్మబద్ధమైన కార్యాలు విజయదుర్గ అనుగ్రహంతో విజయవంతమవుతాయని చెప్పబడుతోంది.

No comments:

Post a Comment

Post Bottom Ad