ఎంత మంచి కుర్రాళ్లు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 21, 2014

ఎంత మంచి కుర్రాళ్లు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20: సెక్యూరిటీ గార్డు కాపలా ఉన్నా.. లోపల సీసీ కెమెరాలు, అత్యంత భద్రత ఉన్నా.. ఏటీఎంలను బద్దలుకొట్టి, గ్యాస్‌ కట్టర్లతో కన్నాలేసి దోచుకెళుతున్న రోజులివి. కానీ.. కళ్లముందు 24 లక్షలు కనిపించినా ఆ విద్యార్థులు చలించలేదు. కనిపించిన నోట్ల కట్టలను జేబులో వేసుకుని వెళదామన్న దుర్బుద్ధి వారిలో కలగలేదు. ప్రజలు భద్రంగా దాచుకున్న సొమ్ముగా పరిగణించి ఆ డబ్బును కాపాడారు. యావత్‌ సమాజానికీఆదర్శంగా నిలిచారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరిగిందీ ఘటన. ఈ ప్రాంతంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎం కేంద్రంలో మూడు ఏటీఎం యంత్రాలున్నాయి. బ్యాంకు సిబ్బంది వాటిలో ఒక్కో దాంట్లో రూ.25 లక్షలు పెట్టారు. అయితే, మధ్యలో ఉన్న ఏటీఎం పనిచేయట్లేదన్న ఖాతాదారుల ఫిర్యాదుతో శనివారం అక్కడికి చేరుకున్నారు. ఏటీఎంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సవరించారు. కానీ వెళ్తూ వెళ్తూ ఏటీఎం యంత్రానికి తాళం వేయడం మరిచారు. దీన్ని ఎవరూ గమనించకపోవడంతో రాత్రి దాకా అలాగే ఉంది. పొద్దుపోయాక అటుగా వచ్చిన ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు లతీఫ్‌, దుర్గా ప్రసాద్‌, హరిప్రసాద్‌.. ఏటీఎం నుంచి డబ్బు తీసుకునేందుకు లోపలికి ప్రవేశించారు.
లతీఫ్‌ తన కార్డుతో మధ్యలోని ఏటీఎం నుంచి కొంత నగదు తీసుకున్నాడు. తర్వాత అతడు కార్డును తీసుకుని వె ళ్లిపోతుండగా.. ఏటీఎం యంత్రంతలుపు తెరుచుకుంది. అంతే! కళ్లు చెదిరేలా డబ్బు కట్టలు!! అంత సొమ్ము ఉన్న ఏటీఎం తలుపు తెరుచుకోవడంతో ముగ్గురు మిత్రులూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు! అంతలోనే వారికి తాము చేయాల్సిన కర్తవ్యం గుర్తొచ్చింది. వెంటనే పోలీస్‌ హెల్ప్‌లైన్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. సమీపంలోనే ఉన్న బ్యాంకు శాఖ వద్దకు పరుగు తీశారు. బ్యాంకు అధికారులకూ సమాచారాన్ని చేరవేశారు. ఈలోగా ఏటీఎంలోకి ఎవరూ ప్రవేశించకుండా అక్కడే కాపలా కాశారు. లోపలికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. విద్యార్థుల సమాచారం అందుకున్న పోలీసులు ఆగమేఘాలపై అక్కడి కి చేరుకున్నారు. అదే సమయానికి అక్కడికి చేరుకున్న బ్యాంకు మహిళా ఉద్యోగి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
కానీ.. బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ రాత్రి 12.30 గంటలకు గాని అక్కడికి చేరుకోలేకపోయారు. మొత్తానికి పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకున్నాక.. తలుపు తెరిచి ఉన్న ఏటీఎంలోని డబ్బును లెక్కించారు. పెట్టిన రూ.25 లక్షల్లో కొందరు విత్‌ డ్రా చేయగా మిగతా రూ.24 లక్షలూ అలాగే ఉన్నాయని.. వాటిలో ఒక్క నోటు కూడా మిస్సవలేదని నిర్ధారించారు. కథ సుఖాంతమైనప్పటికీ.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్యాంకు సిబ్బందినిపోలీసులు మందలించారు. అలాగే.. ప్రజల సొమ్మును కంటికి రెప్పలా కాపాడిన ముగ్గురు విద్యార్థులనూ అభినందించారు. కాగా.. మూడు ఏటీఎం మెషీన్లను ఏర్పాటు చేసిన ఆ కేంద్రం వద్ద ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా కనిపించకపోవడం గమనార్హం.

No comments:

Post a Comment

Post Bottom Ad