Video Of Day

Breaking News

2019లో ఆంధ్రా ముఖ్యమంత్రి ఎవరు?


ap-cm-2019
మొన్న మేలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. వివిధ సంస్థల సర్వేలు, ఎక్కువ మంది మీడియా పెద్దలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని నొక్కి వక్కాణించాయి. జగన్ పొడ గిట్టని కొన్ని మీడియా సంస్థలు పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా.. లోలోన జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని అనుకున్నాయి. అయితే సోనియా గాంధీ దర్శకత్వంలో విధి ఆడిన వింత నాటకంలో ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలుగా విడిపోవడంతో పరిస్థితి తారుమారైంది. మారిన
పరిస్థితుల్లో ఓ అనుభవజ్ఞుడైన, పరిపాలనాదక్షుడైన వ్యక్తి కోసం ఆంధ్ర ప్రజలు చూశారు. ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్ పార్టీలు నిలిచాయి. వీరికి తోడుగా లోక్ సత్తా, కమ్యూనిస్టు పార్టీలు ఉండనే ఉన్నాయి. మరోవైపు చివరలో జన కెరటంలా దూసుకొచ్చాడు జనసేన పేరుతో పవన్ కల్యాణ్. అయితే చివరికి వీరిలో విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్ సోదిలో లేకుండా పోతుందని అందరూ అంచనా వేశారు. అనుకున్నట్టే జరిగింది. మిగిలిన చంద్రబాబు, జగన్ ల అనుభవాన్ని అంచనా వేసుకున్న ప్రజలు చంద్రబాబు అయితే ఆంధ్రప్రదేశ్ మరో హైదరాబాద్ గా.. కాదు కాదు సింగపూర్ లా తీర్చిదిద్దుతాడని ఆయనకు పట్టం గట్టారు. పవన్ కల్యాణ్ కూడా చంద్ర బాబుకే మద్దతివ్వడంతో ఆయన పని తేలికైంది. అయితే చంద్రబాబును ఎన్నుకోవడంలో మరో కారణం కూడా ఉంది. అదేంటంటే 2004 నుంచి 2014 మే వరకు అంటే పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉంది తెలుగుదేశం పార్టీ. ఈసారి కనుక గెలవకపోతే ఇక ఎప్పటికీ చంద్రబాబు సీఎం కాలేడని చాలామంది ప్రజలు భావించారు. ఇలా ఓ వైపు తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన పరిపాలన దక్షత, మరోవైపు ఈ కారణం కలిసివచ్చి తెలుగుదేశం ఘన విజయం సాధించింది.ఇక వైఎస్ఆర్ కుమారుడు జగన్.. చంద్రబాబుతో పోలిస్తే యువకుడు. దూకుడుగా, ముక్కుసూటిగా ముందుకెళ్తారని ఆయనకు పేరుంది. రాష్ర్టం విడిపోక ఉంటే కచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడు. అయితే ఆంధ్రలో తమకు కంటగింపుగా మారిన జగన్ ను, తెలంగాణలో కంటిలో నలుసులా మారిన కేసీఆర్, బీజేపీని దెబ్బకొట్టడానికి ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు  సోనియా గాంధీరాష్ర్ట విభజన చేసింది. అయితే ఇందులో ఒక లక్ష్యం నెరవేరింది. జగన్ సీఎం కాలేకపోయాడు. కేసీఆర్ మాత్రం తన గజకర్ణ, గోకర్ణ విద్యలతో తెలంగాణ క్రెడిట్ మొత్తం తనకే దక్కేలా చూసుకున్నాడు. దీంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మరి 2019లో ఆంధ్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే.. ముగ్గురు ప్రధానంగా పోటీపడే అవకాశముంది. వారు వైఎస్సార్ పార్టీ అధినేత జగన్, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.

జగన్: ప్రస్తుత వయసు 41. 2019 నాటికి 46 ఏళ్లు వస్తాయి. అప్పటికి జగన్ బలాలేంటి అంటే.. ప్రభుత్వ వ్యతిరేకత. ఈ ఐదేళ్లు చంద్రబాబు ఎంత అభివృద్ధి చేసినా.. ప్రభుత్వ వ్యతిరేకత అనేది కాస్తా, కూస్తో, ఎక్కువో తప్పకుండా ఉంటుంది. దీన్ని ఆయన వినియోగించుకోవచ్చు. అప్పటికి వయసులో కూడా మరీ అంతపెద్దవాడు కాడు కాబట్టి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేయొచ్చు. ఆయన పార్టీని ఓడించామనే సానుభూతి, జగన్ కు కూడా ఓ అవకాశం ఇద్ధామని ఆలోచించే ప్రజలు, తన సొంత సామాజికవర్గం, తన తండ్రిని దేవుడిగా కీర్తిస్తున్న అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల అండ ఆయనకు ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ఇక మైనస్ గా నిలిచే అంశం.. తన తండ్రి పేరును ఇప్పటిలా వాడుకోలేకపోవడం. పార్టీ పెట్టిననాటి నుంచి జరిగిన వివిధ ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల్లో ఆయన పదేపదే వాడిన మంత్రం.. తన తండ్రి రాజశేఖరరెడ్డి. మరే ఇతర ఎజెండా లేకుండా తన తండ్రి లానే తాను పాలిస్తానని, తన తండ్రి ఎన్నో మంచి పనులు చేశాడని.. ప్రతి సభలో..పదేపదే ఆయన చెప్పేవారు. ఈ మంత్రంతో ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన సాధారణ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఇది వర్కవుట్ కాదు. ఎందుకంటే నిన్న జరిగిన విషయాలనే ఎవరూ గుర్తుపెట్టుకోరు. ఈ రోజుల్లో మేలు చేసినవాడ్ని గుర్తుంచుకునే ఉత్తములు మచ్చుకు కొందరే. అలాంటిది 2009లో చనిపోయిన తన తండ్రిని 2019 వరకు ప్రజలు గుర్తుంచుకుంటారని అనుకుంటే.. అంతకంటే అబద్ధం  మరేమీ లేదు. కాబట్టి ఈ మంత్రాన్ని వదిలేసి తన సొంత అజెండాతో 2019 ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. అందుకనుగుణంగా సరైన ప్రణాళిక, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం, అప్పటివరకు కేడర్, ఎంఎల్ఏ, ఎంపీలు జారిపోకుండా చూసుకోవడం తలకుమించిన పనే. అప్పటివరకు జగన్ ను బయటే ఉండనిస్తారనే గ్యారెంటీ కూడా లేదు. ఆయన పీకల వరకు కేసులున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టదు. వచ్చే ఎన్నికలనాటికి జయలలితలాగా జగన్ కూడా జైలుకెళ్లే పరిస్థితిని సృష్టించవచ్చు.

లోకేశ్: చంద్రబాబు నాయుడు ఒక్కగాని ఒక్క కుమారుడు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అల్లుడు కమ్ మేనల్లుడు. వయసు 33. 2019 ఎన్నికలనాటికి 38 ఏళ్లు వస్తాయి. ప్రస్తుతం వాళ్ల కుటుంబ వ్యాపారం హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. ప్రఖ్యాత స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ- అమెరికా నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నాడు. చదువు పూర్తి చేసుకున్నాక ప్రపంచబ్యాంక్ తరపున వివిధ దేశాల్లో పనిచేశాడు. 2009 ఎన్నికలప్పుడే పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. నగదు బదిలీ పథకానికి రూపకల్పన చేసింది కూడా ఆయనే. అద్భుత పథకంగా తెలుగుదేశం వర్గాలు దీన్ని కీర్తించాయి. తెలుగుదేశాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయని కలలు కన్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంతో తెలుగుదేశం ఓటమిబాటలో పయనించింది. అయితే అదంతా గతం. తాజాగా మొన్నటి ఎన్నికల్లో కూడా అభ్యర్థుల ఎంపిక, పార్టీ సోషల్ మీడియా ప్రచారం, తెలుగు యువత కార్యక్రమాలు మొదలైనవన్నీ లోకేశ్ కనుసన్నల్లోనే జరిగాయి. ఒకదశలో చంద్రబాబు.. ములాయం సింగ్ యాదవ్ లాగా ఢిల్లీ రాజకీయాల్లో, లోకేశ్.. అఖిలేశ్ యాదవ్ లాగా ముఖ్యమంత్రిగా ఉండాలనే వార్తలు, డిమాండ్లు వినిపించాయి.  అయితే రాష్ర్టం విడిపోయిన నేపథ్యంలో అనుభవజ్ఞుడిని కోరుకుంది కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎంపికయ్యారు. 2019 ఎన్నికలనాటికి మాత్రం లోకేశ్ తెలుగుదేశం ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరమీదకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబుకు కూడా అప్పటికి 70 ఏళ్లు వస్తాయి. ఆ వయసులో అంత క్రియాశీలకంగా తిరగడం, పర్యటించడం కుదరకపోవచ్చు. కాబట్టి లోకేశ్ ఆరంగేట్రం ఖాయం. యువకుడు కావడం, వివిధ దేశాల పర్యటించి అక్కడి సమస్యలను అధ్యయనం చేయడం, బాగా చదువుకున్న వ్యక్తి కావడం, అటు సొంత సామాజికవర్గం అండదండలు మెండుగా లభించే అవకాశాల లోకేశ్ ప్లస్సులు. మైనస్ ల విషయానికొస్తే.. వాగ్ధాటి లేదు. జగన్ తో పోలిస్తే కలివిడితనం, చొరవ, దూసుకుపోయేతత్వం లేవు.
ఇంకా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు కూడా తెలుగుదేశం తరపున పోటీలో ఉండొచ్చు. బాలకృష్ణకు ఉర్రూతలూగించేలా మాట్లాడటం చేతకాదు. ఆరాధ్య అభిమానులు మాత్రం కోకొల్లలుగా ఉన్నారు. సొంత సామాజిక వర్గంలో ప్రాణాలు ఇచ్చే వీరాభిమానులున్నారు. అయితే లోకేశ్ ను కాదని బాలకృష్ణ పోటీలోకి రాకపోవచ్చు. ఇక జూనియర్ ఎన్టీఆర్.. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఆది, సింహాద్రి వంటి సినిమాలతో తెలుగు సినిమా రికార్డులు తిరగరాసిన ఈ 'బుడ్డోడు' కి ప్రస్తుతం సరైన హిట్ లేదు. మంచి హిట్ కోసం హిట్ సినిమాల దర్శకులు, హీరోయిన్ల వెంటపడుతున్న ఫలితం శూన్యం. మరోవైపు ఎప్పటికైనా లోకేశ్ కు పోటీవచ్చే ప్రమాదం ఉందని కుటుంబం దూరం పెట్టింది. మొన్నటి ఎన్నికల్లోనూ పార్టీ తరపున ప్రచారం చేయలేదు. కానీ ఒక సరైన హిట్ పడితే తెలుగు సినిమాను వణికించగలడు. అంతేస్థాయిలో తన వాడివేడి ప్రసంగాలతో ప్రత్యర్థులను కూడా. 2009 ఎన్నికల్లోనే తన తాతలాగా అచ్చం ఖాకీ బట్టలు వేసుకుని బుడ్డోడు ఇచ్చిన ప్రసంగాలకు ప్రజలు మైమరిచిపోయారు. అయితే యాక్సిడెంట్ జరగడంతో నాటి ఎన్నికల్లో పూర్తిస్థాయిలో ప్రచారం చేయలేకపోయాడు. అయితే బళ్లు ఓడలు కావచ్చు. ఓడలు... బళ్లు కావచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి 2019 నాటి ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీపడే అవకాశం ఉంది.

పవన్ కల్యాణ్: గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది.. వంటి సినిమాలతో తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టాడు.. పవన్ కల్యాణ్. తన విలక్షణ వ్యక్తిత్వం, అర్థంకాని స్వభావం, జయాపజయాలకు వెరవని తత్వం.. ఒక్క మాటలో చెప్పాలంటే 'నాకు తిక్కుంది.. దానికి లెక్క లేదు' తరహా శైలి. 'కేసీఆర్ నీ తాట తీస్తా' అన్నా.. 'కాంగ్రెస్ నాయకుల పంచెలు ఊడగొట్టండి' అన్నా.. 'జగన్ హఠావో.. సీమాంధ్ర బచావో' అని రెచ్చిపోయినా అది పవన్ కు మాత్రమే సొంతం. మొదటి నుంచి మీడియాకు దూరంగా, అతి తక్కువ సన్నిహితులతో మాత్రమే గడిపే పవర్ స్టార్ అతి సామాన్యంగా ఉంటాడు. జయాపజయాలను లెక్కగట్టడు. గుప్తదానాలు, ఎవరీ గురించి చెడుగా మాట్లాడకపోవడం, మాట ఇస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకపోవడం.. వంటి విశిష్టతలు పవన్ సొంతం. తనతో పనిచేసిన నటులు, దర్శకులు, నిర్మాతలు అందరూ పవన్ లాంటి మంచి మనిషి మరెక్కడా లేడని చెబుతారు. అలాంటి పవన్ 2009లో తన అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ.. అనుబంధ విభాగం యువరాజ్యం అధ్యక్షుడిగా తన వాడివేడి ప్రసంగాలతో నాటి ఎన్నికల్లో అదరగొట్టాడు. అయితే టిక్కెట్లు అమ్ముకున్నారన్న అపవాదు, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరగకపోవడం, పార్టీ గుర్తు రైలింజన్ జనంలోకి అంతగా వెళ్లకపోవడం వంటి కారణాలతో ప్రజారాజ్యం అపజయాన్ని మూటగట్టకుంది. తర్వాత మారిన పరిణామాల్లో ప్రజారాజ్యాన్ని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయడం, కేంద్ర మంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. పవన్ పార్టీని విలీనం చేయొద్దన్నాడని, నిదానంగా పార్టీని గ్రామస్థాయి వరకు నిర్మిద్దామని అన్నయ్యతో అన్నట్లు వార్తలొచ్చాయి. అయితే చిరంజీవి దీన్ని లక్ష్యపెట్టలేదు. ఇక ఆనాటి నుంచి అన్నదమ్ముల మధ్య వైరం మొదలైందని, కుటుంబంలో పవన్ ఒంటరిగా మిగలాడని రూమర్లు బయలుదేరాయి. తన కుటుంబ సభ్యుల ఆడియో వేడులకు పవన్ హాజరుకాకపోవడం కూడా అన్నదమ్ముల మధ్య ఏదో జరుగుతుందనే వార్తలకు ఊతమిచ్చాయి. ఈ క్రమంలోనే తన కుటుంబసభ్యులకు నచ్చకపోయినా పవన్ జనసేన పార్టీతో ప్రజల ముందుకొచ్చాడు. తన తొలి ప్రసంగంలోనే కేసీఆర్ కుటుంబ సభ్యులను, కాంగ్రెస్ నేతలను ఉతికిఆరేశాడు. అయితే పార్టీకి గుర్తింపు లభించకపోవడం, సరైన అభ్యర్థులు లేకపోవడం వంటి కారణాలతో ఓట్లు చీల్చడం ఇష్టం లేక బీజేపీ కూటమితో చేయి కలిపాడు. ఎన్నికల ప్రచారం చివరలో సుడిగాలిలా చెలరేగాడు. తన వాడివేడి ప్రసంగాలతో హోరెత్తించాడు. తెలుగుదేశం విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక 2019 ఎన్నికల నాటికి పవన్ వయసు 48 ఏళ్లు అవుతుంది. తన పార్టీకి ఇంకా ఎన్నికల సంఘం గుర్తింపు రాలేదు. పార్టీని గ్రామగ్రామాన విస్తరించాలి. మంచి కార్యకర్తలను, నాయకులను తయారుచేసుకోవాలి. ఎన్నికలంటే తప్పకుండా ఉండాల్సింది అంగ, అర్థ బలాలు. మొదటిది ఆయనకు ఫుష్కళంగా ఉంది. తన సొంత సామాజిక వర్గం కాపులు.. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో 21 శాతం మంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం జనాభా కేవలం 8 శాతం, మరో పోటీ పార్టీ కులం రెడ్ల శాతం 11 నుంచి 12 శాతం. కులాలపరంగా చూసినప్పుడు సాధారణంగా పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి. కానీ రాజకీయాలు అలా ఉండవు. ఒక్కోసారి సొంత కులం ఓట్లు కూడా పడవు. ఇందుకు ఉదాహరణ.. ప్రజారాజ్యం పార్టీ. ఆ పార్టీకి ఓట్లేసిన కాపులు 52 శాతం మందే. అంటే సగం మంది వేయలేదు. వాళ్లందరూ వేసిఉంటే ఏం జరిగేదో చెప్పాల్సిన పనిలేదు కదా! చిరంజీవి సులువుగా ముఖ్యమంత్రి అయ్యేవాడు. కొత్త రాష్ర్టంలో కాపులు అండ లేనిదే ఏ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. అందుకే జగన్ 6 ఎంపీ సీట్లు, దాదాపు 40 అసెంబ్లీ సీట్లు కాపులకు ఇచ్చాడు. తెలుగుదేశం జగన్ పార్టీతో పోలిస్తే తక్కువే ఇచ్చింది. ఈ ప్రమాదాన్ని పసిగట్టే చంద్రబాబు పవన్ ఇంటిముందు నిలబడ్డాడు. చివరి క్షణంలో పవన్ ను తనవైపుకుతిప్పుకున్నాడు. ఇదే పవన్ కు అతిపెద్దబలం. ఆయనకు కులాభిమానం లేకపోయినా కాపులు ఆయనను నెత్తినపెట్టుకుంటారు. ఇక సినిమాలపరంగా అభిమానించే ఇతర కులస్తులు, పవన్ వ్యక్తిత్యం నచ్చిన కొంతమంది తటస్థులు పవన్ వెనకే ఉండొచ్చు! ఇక పవన్ బలహీనతంటే ఇప్పటివరకు పార్టీకి అన్నీ ఆయనే.. కార్యవర్గం లేదు. పార్టీ నడపాలంటే భారీగా డబ్బుకావాలి. అదీ లేదు. రాజకీయాలంటే అబద్ధాలు చెప్పాలి.. చేయలేని పనులు కూడా చేస్తామని చెప్పాలి. ఇవేమీ పవన్ కు చేతకాదు. అంతేకాకుండా ఆయన ముక్కుసూటితనం, కొంచెం దుడుకుస్వభావం మేలూ లేదా కీడూ చేయొచ్చు. ఇక అప్పటి ముఖ్యమంత్రి ఎవరనేది.. కాలమే నిర్ణయిస్తుంది.

No comments