టీఆర్ఎస్ గూటికి చేరనున్న తుమ్మల ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, August 29, 2014

టీఆర్ఎస్ గూటికి చేరనున్న తుమ్మల !

హైదరాబాద్ :ఖమ్మం జిల్లా రాజకీయ సమీకరణలు గణనీయంగా మారిపోనున్నాయి. జిల్లాలో టీడీపీకి గట్టి పట్టున్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చేనెల 5వ తేదీ మధ్యా హ్నం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.
మరోవైపు వైఎస్సార్సీపీకి చెందిన వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌కు చెందిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కూడా రేపోమాపో టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది. మూడు పార్టీల ముఖ్యనేతలు తమ అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లోకి వస్తుండటంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు కొత్త రూపు సంతరించుకోనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 

జిల్లాలో టీడీపీకి చెందిన క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి జిల్లా స్థాయి నేతల వరకూ అంతా తుమ్మల వెంట నడిచేందుకు సిద్ధమవడంతో జిల్లాలో టీడీపీ ఖాళీకానుంది. గ్రామ గ్రామాన ఉన్న పార్టీ కమిటీలు అన్ని టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి.
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబులతోపాటు వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలు తుమ్మల వెంట నడుస్తామని ప్రకటన చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలు తుమ్మల బాటలోనే వెళతారని ప్రచారం జరుగుతున్నది. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు భారీగా తుమ్మలవెంట టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
తుమ్మల చేరికపై ఇప్పటికే ఆయన అనుచరులు అన్ని మండలాల్లో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రతి మండలంలోకి తుమ్మల వెంటే నడుస్తామంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 5న ఖమ్మం నుంచి సుమారు 2వేల వాహనాలతో తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌కు ర్యాలీగా బయలుదేరి, టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఖమ్మం నుంచి సూర్యాపేట వరకు వాహనాల శ్రేణి ఉండే విధంగా పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేస్తున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad