ఆ ఇద్దరు నన్ను మోసం చేశారు: పూరి జగన్నాథ్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, August 29, 2014

ఆ ఇద్దరు నన్ను మోసం చేశారు: పూరి జగన్నాథ్

హైదరాబాద్: తనను బిల్డర్ సుబ్బరాజు, రామరాజులు మోసగించారని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తెలిపారు. జూబ్లీహిల్స్ లోని తన కుటుంబానికి చెందిన ఖాళీ స్థలాన్ని రామరాజు, సుబ్బరాజులకు ఐదేళ్ల కిత్రమే విక్రయించానని చెప్పారు. ఆ సమయంలోనే మాసాబ్ ట్యాంక్ ఎస్ బీఐ బ్రాంచ్ లో తనకు రూ.5 కోట్ల రుణం ఉందని ఆ ఇద్దరికి చెప్పానని పూరి స్పష్టం చేశారు. అయితే ఆ రుణాన్ని తమ పేర్లపైకి బదిలీ చేసుకుంటామని సుబ్బరాజు, రామరాజులు తనకు హామీ ఇచ్చారని చెప్పారు. అందుకు ఆ బ్రాంచ్ మేనేజర్ కూడా అంగీకరించాడని  తెలిపారు. ఇందకు సంబంధించిన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.
మూడేళ్ల క్రితం నేనే ఇంటిపై రుణం తీసుకునేందుకు సదరు బ్యాంక్ కు వెళ్లగా ఎస్ బీఐలో రుణం పెండింగ్ లో ఉందని బ్యాంకు అధికారులు తనకు గుర్తు చేశారు. ఆ క్రమంలో వెంటనే తాను (2011లో) బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి... సుబ్బరాజు, రామరాజులపై ఫిర్యాదు చేసినట్లు పూరి వివరించారు. ఆ విషయం తెలుసుకున్న ఆ ఇద్దరు విదేశాలకు పారిపోయారన్నారు. తాన నుంచి కొనుగోలు చేసిన ఆ స్థలాన్ని వారిద్దరు ఇతరులకు విక్రయించారని చెప్పారు. అసలు విషయం వారికి తెలియక ఫ్లాట్ యజమానులు తనపై ఫిర్యాదు చేశారని పూరి విశదీకరించారు.
ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ పై సీసీఎస్ పోలీసులు గురువారం చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో పూరి జగన్నాథ్ కుటుంబానికి వెయ్యి గజాల స్థలం ఉంది. ఆ స్థలంపై ఓ జాతీయ బ్యాంకులో సుమారు రూ. 5 కోట్ల రుణం తీసుకున్నారు. సగం వాయిదాలు సక్రమంగా చెల్లించారు. ఇదిలావుండగా, ఈ స్థలాన్ని బిల్డర్ సుబ్బరాజుకు డెవలప్ మెంట్ కు ఇవ్వగా సదరు బిల్డర్  ఫ్లాట్స్ కట్టి నలుగురికి విక్రయించాడు. బ్యాంకు రుణం తీరకపోవడంతో అధికారులు రుణం చెల్లించాలంటూ ఫ్లాట్స్ కొనుగోలు చేసిన నలుగురు వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. బ్యాంకులో రుణం ఉండగా ఫ్లాట్స్ ఎలా కొనుగోలు చేస్తారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఫ్లాట్ యజమానులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిరు. బిల్డర్ సుబ్బరాజుతోపాటు పూరి జగన్నాథ్ లు తమను మోసం చేసి ఫ్లాట్లు విక్రయించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నాంపల్లి కోర్టు నుంచి పూరి బెయిల్ తీసుకున్నారు.
సదరు ఖాళీ స్థలం పూరి జగన్నాథ్ భార్య లావణ్య పేరుతో ఉందని, బిల్డర్ కు అగ్రిమెంట్ చేసే సమయంలో బ్యాంకు రుణం గురించి ప్రస్తావించారా లేదా అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని సీసీఎస్ డీసీపీ పాల్ రాజు తెలిపారు. కాగా బిల్డర్ సుబ్బరాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని డీసీపీ చెప్పారు. దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.
 

No comments:

Post a Comment

Post Bottom Ad