నిత్యానంద పురుషత్వ పరీక్షలపై స్టే - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, August 05, 2014

నిత్యానంద పురుషత్వ పరీక్షలపై స్టే

న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించడంపై సుప్రీం కోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. అత్యాచారం కేసులో నిందితుడైన నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించడానికి  కర్ణాటక హై కోర్టు గత నెలలో అనుమతించిన విషయం తెలిసిందే.   పురుషత్వ పరీక్షల నుంచి తనను మినహాయించాలని నిత్యానంద దాఖలు చేసిన  పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. జులై 28 నుంచి నిత్యానందను పోలీసులు కష్టడీలోకి తీసుకుని  పురుషత్వ, రక్త తదితర పరీక్షలతో పాటు విచారణ కూడా చేయవచ్చునని హై కోర్టు తెలిపింది.
నిత్యానందపై అత్యాచార కేసు పూర్వాపరాలను పరిశీలించిన రామనగర సెషన్స్ కోర్టు  తొలుత నిత్యానందకు పురుషత్వ  పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే దీనిని ప్రశ్నిస్తూ నిత్యానంద హై కోర్టును ఆశ్రయించారు. తాను థార్మిక గురువునని, తనకు ఐహిక సుఖాలపై వాంఛలు ఉండవన్నారు. అందువల్ల తనకు పురషత్వ పరీక్షలు నిర్వహించకూడదని పేర్కొన్నాడు.  ఈ కేసును విచారించిన హై కోర్టు నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ నెల 6న  పురుషత్వ పరీక్షల కోసం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి హాజరు కావాలని సిఐడి  అధికారులు గత నెల 27న నిత్యానందకు నోటీసులు జారీ చేశారు. పరీక్షలకు హాజరుకాకపోతే  కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
 ఈ నేపధ్యంలో నిత్యానంద సుప్రీం కోర్టును ఆశ్రయించారు.సుప్రీం కోర్టు పురుషత్వ పరీక్షలపై ప్రస్తుతానికి స్టే విధిస్తూ, ఇతర వైద్య పరీక్షలకు, విచారణకు  నిత్యానంద సహకరించాలని ఆదేశించింది. పూర్వాపరాలు తెలుసుకునేందుకు ఈ కేసు లోతులకు వెళ్లవలసిన అవసరం ఉందని కోర్టు తెలిపింది. అత్యాచారం కేసులో నిందుతులైన నిత్యానంద, అతని సహచరులు  ఈ నెల 6న  సిఐడి  అధికారుల ముందు హాజరుకావాలని ఆదేశించింది. అదేవిధంగా ఈ నెల 18న బెంగళూరులోని రామనగర చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ముందర హాజరు కావాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


No comments:

Post a Comment

Post Bottom Ad