రాజధానిపై కాంగ్రెస్ నాయకుల రచ్చ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, February 25, 2014

రాజధానిపై కాంగ్రెస్ నాయకుల రచ్చ!

రాష్ట్ర విభజన ఖరారయ్యే వరకు సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ఉద్యమం నడిపినట్లు జనాలకు కలరిచ్చిన నాయకులంతా ఇప్పుడు అసలు రంగు బయటపెడుతున్నారు. తెలంగాణకు హైదరాబాద్ ఉన్నందున.. ఆంధ్రప్రదేశ్ కు ఏర్పడే కొత్త రాజధాని ఎక్కడుండాలంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాజధాని నగరం తమ ప్రాంతంలో ఉండాలంటూ పిచ్చిగా వాదిస్తున్నారు. నిపుణుల కమిటీ ఒకదాన్ని నియమిస్తున్నామని, ఆరు నెలల్లోగా కొత్త రాజధాని నగరం ఎక్కడుండాలో వారు శాస్త్రీయంగా నిర్ణయిస్తారని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, తెలంగాణ విషయమై కేంద్రం నియమించిన జీవోఎంలో సభ్యుడు జైరాం రమేష్ చెప్పినా.. అది ఏమాత్రం పట్టించుకోకుండా, తమకు అనుకూలంగా ఉండే ప్రాంతాలు చూసుకుని అక్కడే రాజధాని ఉండాలంటూ మైకులు పట్టుకుని ఊదరగొడుతున్నారు. అరకు పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిశోర్ చంద్రదేవ్.. సమైక్య ఉద్యమ సమయంలో ఎక్కడా కనిపించలేదు, కనీసం దానికి మద్దతుగా కూడా ఏమీ మాట్లాడలేదు. కానీ, ఇప్పుడు మాత్రం విశాఖపట్నాన్నే కొత్త రాష్ట్రానికి రాజధానిగా చేయాలని వాదిస్తూ తెరపైకి వస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం బాగా వెనకబడిందని, ఇక్కడ రాజధాని నగరం పెడితే ఇటు ఉత్తరాంధ్రతో పాటు అటు గోదావరి జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని సలహా కూడా ఇస్తుండడం వింతగా మారింది.

కొత్త రాష్ట్రానికి విజయవాడ కేంద్ర స్థానంలో ఉంటుందని, అక్కడ రాజధానికి కావల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయని, అటు రాయలసీమకు, ఇటు కోస్తాకు, ఉత్తరాంధ్రకు కూడా అనుకూలంగా ఉంటుందని మాజీ మంత్రి పార్థసారథి చెబుతున్నారు. ప్రభుత్వ భూములు, విమానాశ్రయం కూడా ఉందని వాదిస్తున్నారు. ఇక కేంద్ర మంత్రి పళ్లంరాజు మాత్రం... తూర్పుగోదావరి జిల్లాలో ఒక మూలన ఉన్న కాకినాడ నగరాన్ని ఏకంగా రాష్ట్రానికే రాజధాని చేయాలని ప్రయత్నిస్తున్నారు.  జిల్లాలోనే రాజమండ్రి కేంద్రంగా ఎక్కువ కార్యకలాపాలు జరుగుతుండగా... దాన్ని వదిలేసి.. కాకినాడను రాజధాని చేయాలనడం విడ్డూరంగా ఉందంటున్నారు.  ఇదిలా ఉంటే తిరుపతిని కొత్త రాష్ట్రం రాజధాని నగరంగా చేయాలని ఎంపీ చింతా మోహన్ అంటున్నారు. గతంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూలునే ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని చేయాలని టీజీ వెంకటేశ్ వాదిస్తున్నారు. ఇంతకుముందు తాము రాజధాని నగరాన్ని వదిలేసుకుని నష్టపోయామని, ఇప్పుడు మళ్లీ అలాంటి అన్యాయమే జరిగితే ఊరుకునేది లేదని గట్టిగానే అంటున్నారు. కర్నూలును రాజధాని చేయకపోతే రాయలసీమ నాలుగు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందేనని పట్టుపట్టడం విశేషం. 

No comments:

Post a Comment

Post Bottom Ad