ట్రిపుల్ ఐటీలో అన్నీ ట్రబుల్సే! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, February 24, 2014

ట్రిపుల్ ఐటీలో అన్నీ ట్రబుల్సే!

నిత్యం సమస్యలతో సావాసం! నిద్రలేవగానే నీటి కష్టాలు! స్నానాలకు సౌకర్యాలకు కొరత! బాత్ రూమ్ కి వెళ్లాలంటే బారులు తీరాల్సిన పరిస్థితి! మెస్ లోనూ మెనూ ప్రకారం భోజనం ఉండదు! ఈ సమస్యలు చాలవన్నట్లు కరెంటు కట్లతో కారు చీకటిలోనే చదువులు! బయటకెళ్లి చదవుదామంటే చుట్టు పక్కల ఉండే ఫ్యాక్టరీల దుర్గంధం! ఫలితం విద్యార్థులకు అష్టకష్టాలతోపాటు అనారోగ్యం.  ఇవన్నీ.. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని హాస్టల్ పరిస్థితులు కావు! అత్యంత అధునాతన సౌకర్యాలతో నెలకొల్పిన ఓ ట్రిపుల్ ఐటీలోని పక్కా వాస్తవాలు!

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో
ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. అత్యున్నత స్థాయి ప్రయోగశాలలు, తరగతి గదులు, భోజన, తదితర మౌలిక వసతులతో కూడిన ఇంజనీరింగ్ విద్యతోపాటు ఎన్‌సీసీ, యోగా, శాస్త్రీయ సంగీతం, నృత్యం, క్రీడలు వంటి రంగాల్లోనూ శిక్షణ అందించడం వాటి విధి. రాష్ట్రంలోని బాసర ట్రిపుల్ ఐటీ.. నెల రోజుల క్రితం యూనివర్సీటి గ్రాంట్ కమిషన్ నిపుణుల బృందంచే కితాబు అందుకుంది. ఇక్కడి విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణిస్తూ, ప్లేస్ మెంట్లలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధిస్తున్నారని ప్రశంసలు పొందారు. అంతలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థ విద్యార్థులు న్యాయం కోసం రోడ్డెక్కారు. ట్రిపుల్ ఐటీ కళాశాల అధికారుల నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణం బలి తీసుకుందని కోపోద్రిక్తులయ్యారు.

కళాశాలలో ఈ-4 చదువుతున్న నల్గొండ జిల్లా కనగరి మండలం గౌరారం గ్రామానికి చెందిన నాగరాజు ఆదివారం ఉదయం ఏడు గంటలకు బీహెచ్-1 భవనం నాలుగో అంతస్తు నుంచి దూకాడు. దీన్ని గమనించిన విద్యార్థులు... ట్రిపుల్ ఐటీ అధికారులకు సమాచారం అందించగా వారు ఆలస్యంగా స్పందించడం విద్యార్థుల కోపానికి కారణమైంది. అంతేకాకుండా ట్రిపుల్ ఐటీలోని ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది, అంబులెన్సు అందుబాటులో లేకపోవడంతో సాధారణ వ్యానులోనే విద్యార్థిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో వైద్య సేవలు అందిస్తున్న క్రమంలోనే నాగరాజు ప్రాణాలు వదలడంతో  ట్రిపుల్ ఐటీలో చదువుతున్న ఆరు వేల మంది విద్యార్థులు భైంసా-బాసర ప్రధాన రహదారిపై బైఠాయించారు. రాత్రి వరకు విద్యార్థులు ధర్నా విరమించకపోవడంతో ఆర్‌జీయూకేటీ రిజిస్ట్రార్ సోమయ్య... ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ రాజేంద్రసాహూ, ఓఎస్‌డీ నారాయణ, డీఈ రాజేశ్వర్, సీఎస్‌వో వాజొద్దీన్, కార్యాలయ అధికారి బద్రిలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad