కారు.. కాంగ్రెస్ గూటికి వెళ్తుందా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, February 19, 2014

కారు.. కాంగ్రెస్ గూటికి వెళ్తుందా?

పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం నేపథ్యంలో... తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ ఎప్పుడెప్పుడు కాంగ్రెస్లో విలీనం కానుందని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందటానికి ఒక రోజు ముందుగా రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు రావడంతో విలీనంపై చర్చజరిగినట్లు టీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. అయితే.. రాహుల్‌తో కేసీఆర్ భేటీని ఆయన సన్నిహితులు ధ్రువీకరించటం లేదు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం ఉండదని కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌లో విలీనం కావలసిన అవసరం లేదు. 2009లో ప్రకటన చేసి... ఐదేళ్ల తర్వాత.. ఎన్నికల ముందు హడావిడిగా తెలంగాణ ఇస్తే... అందులో కాంగ్రెస్ గొప్పతనం ఏముందని ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవాల్సిన అవసరం లేదని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి వారి పార్టీ తెలంగాణ సీనియర్లు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీకి సంపూర్ణ అధికారం వస్తుందని వారు భావిస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్ విలీనం, ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు తెలంగాణ రాష్ట్రంపై సంపూర్ణ అధికారాలు ఇవ్వడానికి వారు ఇష్టపడడం లేదు. తెలంగాణ ఇచ్చిన తర్వాత రాజకీయ పరిస్థితులు, జేఏసీ వంటి రాజకీయేతర ఉద్యమ సంస్థల వైఖరి, టీఆర్‌ఎస్ బలాబలాలు వంటి వాటిపై నివేదికలు తయారుచేసి పార్టీ ఉపాధ్యక్షుడికి ఇచ్చే పనిలో పడ్డారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad