సూపరింటెండెంట్, ప్రిన్సిపల్ లను మార్చిన తెలంగాణ వాదులు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 04, 2013

సూపరింటెండెంట్, ప్రిన్సిపల్ లను మార్చిన తెలంగాణ వాదులు!

ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్‌దాస్ ఆగస్టు 31న పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో డాక్టర్ శివరామ్‌రెడ్డిని సూపరింటెండెంట్‌గా నియమించారు. ఆయన  పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటలకే తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, మెడికల్ జేఏసీల ప్రతినిధులు ఆయన చాంబర్‌ను ముట్టడించారు. లోపలికి వెళ్లి శివరామిరెడ్డితో వాగ్వాదానికి దిగారు. ‘మీకన్నా ఎక్కువ సీనియారిటీ ఉన్న నయాపూల్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సువర్ణకు దక్కాల్సిన పోస్టులో ఎలా కొనసాగుతారు’ అంటూ ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన డాక్టర్ సువర్ణకు దక్కాల్సిన పదవిని పైరవీ చేసి పొందారని ఆరోపించారు. వెంటనే ఉన్నతాధికారులను కలిసి ఉస్మానియా సూపరింటెండెంట్‌గా కొనసాగలేనని చెప్పాలని సలహా ఇచ్చారు. లేకుంటే ఇప్పటికిప్పుడే వైద్య సేవలు నిలిపేసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం ఆయనను సూపరింటెండెంట్ కుర్చీ నుంచి తప్పించి సువర్ణను కూర్చొబెట్టి, పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ఉస్మానియా దంత వైద్య కళాశాలకు చేరుకున్నారు.

ఆగస్టు 31న దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్ కమలాదేవి పదవీ విరమణ పొందగా ఆమె స్థానంలో సీమాంధ్రకు చెందిన అదే ఆసుపత్రిలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అన్నపూర్ణను నియమించారు. సోమవారమే ఆమె బాధ్యతలు చేపట్టారు. టీజీడీఏ, మెడికల్ జేఏసీ ప్రతినిధులు అన్నపూర్ణను కలిసి రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన మీరు ప్రిన్సిపల్‌గా ఎలా బాధ్యతలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉత్వర్వుల మేరకే పదవీ బాధ్యతలు స్వీకరించానని అన్నపూర్ణ పేర్కొనగా, తెలంగాణకు చెందిన డాక్టర్ బాల్‌రెడ్డికి అన్ని అర్హతలు ఉన్నా.. ఆయన్ను తప్పించి పదవి పొందారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఆమె వెళ్లిపోవడంతో ఆ స్థానంలో బాల్‌రెడ్డిని కూర్చోబెట్టి స్వీట్లు తినిపించారు. తర్వాత అక్కడ్నుంచి వెళ్లి కోఠిలోని వైద్య విద్య సంచాలకుల కార్యాలయానికి వెళ్లారు. ప్రభుత్వం 24 గంటల్లోగా సూపరింటెండెంట్‌గా సువర్ణను, దంత వైద్యశాల ప్రిన్సిపల్‌గా బాల్‌రెడ్డిలను నియమించకపోతే నగరంలో వైద్యసేవలు నిలిపేస్తామంటూ డీఎంఈ శాంతారావుకు సమ్మె నోటీసు ఇచ్చారు.

No comments:

Post a Comment

Post Bottom Ad