తప్పుకోక తప్పని పరిస్థితి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, June 02, 2013

తప్పుకోక తప్పని పరిస్థితి


భారత క్రికెట్ నియంత్రణ మండలి (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా - బిసిసిఐ) అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ ఆ పదవి నుంచి దిగిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాజీనామా చేయనని ఎంత భీష్మించుకు కూర్చున్నా చివరకు దిగిరాక తప్పలేదు. తన మేనల్లుడు గురునాథ్ మేయప్పన్ వ్యవహారం చెన్నైకి చెందిన ఈ ప్రముఖ పారిశ్రామికవేత్త మెడకు చుట్టుకుంది. ఐపిఎల్ 6- టి20 మ్యాచ్ లలో భాగంగా ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ ఆడిన మ్యాచ్ లో స్పాట్ ఫిక్సింగ్ జరిగిన విషయం సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో కొత్త కొత్త విషయాలతోపాటు కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చారు. ఇంకా వస్తున్నారు.

స్పాట్ ఫిక్సింగ్ కు సంబంధించి గత నెల 16న క్రికెట్ క్రీడాకారులు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్ లతోపాటు 11 మంది బుకీలను అరెస్ట్ చేశారు. దాంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన భారత క్రికెట్ బోర్డులో సంక్షోభం మొదలైంది. ఆ తరువాత బాలీవుడ్ నటుడు విందూ సింగ్, శ్రీనివాసన్ మేనల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓగా వ్యవహరించిన గురునాథ్ మేయప్పన్.....ను అరెస్ట్ చేశారు. దాంతో శ్రీనివాసన్ పై వ్యతిరేకత పెరగసాగింది. ఈ కేసుకు సంబంధించి పలువురు క్రీడాకారులను, ప్రముఖులను పోలీసులు విచారిస్తున్నారు. మేయప్పన్ అరెస్ట్ తో బిసిసిఐ అధ్యక్ష పదవికి శ్రీనివాసన్ రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేశారు. శ్రీనివాసన్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, రాజీనామా చేయనని తెగేసి చెప్పారు. తనను ఎవరూ తొలగించలేరని కూడా అన్నారు.

మేయప్పన్ కు బుకీలతో సంబంధాలు ఉన్న విషయం తెలిసి ఐసీసీ అవినీతి నిరోధక, భద్రతా యూనిట్ (ఏసీఎస్‌యూ) అతనిని హెచ్చిరించినట్లు తెలియడంతో సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. శ్రీనివాసన్ పై వత్తిడి పెరిగింది. తొలుత ఆయనకు మద్దతు పలికినవారు కూడా దూరమవసాగారు. బిసిసిఐలో ఆయన దాదాపు ఒంటరివారయ్యారు. బోర్డు కార్యదర్శి సంజయ్ జగ్దాలేతో పాటు కోశాధికారి అజయ్ షిర్కే తమ పదవులకు ఈరోజు రాజీనామా చేశారు. గురునాథ్‌పై విచారణకు బీసీసీఐ నియమించిన ముగ్గురు సభ్యుల కమిషన్ నుంచి కూడా తాను వైదొలుగుతున్నట్లు జగ్దాలే ప్రకటించారు. అరుణ్ జైట్లీ, శివలాల్ యాదవ్ తోపాటు మొత్తం ఐదుగురు బోర్డు ఉపాధ్యక్షులు కూడా రాజీనామా చేయాలన్న యోచనలో ఉన్నట్లు వినవస్తోంది. ఈ నేపధ్యంలో వత్తిడి తీవ్రతరం కావడంతో శ్రీనివాసన్ కు ఓ మెట్టు దిగిరాక తప్పలేదు. ఈనెల 8న వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అయితే ఈ కేసు రోజుకో మలుపు తీరుగుతున్న పరిస్థితులలో రేపే(2.6.13) సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రేపు ఉదయం 11 గంటలకు చెన్నైలో బిసిసిఐ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశం జరుగుతుంది.

ఈ సమావేశంలో బిసిసిఐ అధ్యక్ష పదవికి శ్రీనివాసన్ రాజీనామా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. శ్రీనివాసన్ రాజీనామా అనంతరం తాత్కాలిక అధ్యక్షుడిని నియమించే అవకాశాలున్నాయి. మాజీ అధ్యక్షుడు, సుప్రీం కోర్టు న్యాయవాది శశాంక్ మనోహర్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తారని తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే వరకు తాత్కాలిక అధ్యక్షుడు కొనసాగుతారు. అయితే రాజీనామా చేయకుండా శ్రీనివాసన్ ఓ రాజీ ఫార్మలా ప్రతిపాదించినట్లు మరో కథనం కూడా వినవస్తోంది. శ్రీనివాసన్ అధ్యక్షుడిగానే కొనసాగుతూ శశాంక్ మనోహర్‌ను వర్కింగ్ ప్రసిడెంట్ గా ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. ఓ రోజు నిరీక్షించండి ప్రకటన వెలువడుతుందని ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు. ఆ ప్రకటన ఏమిటో తెలుసుకోవాలంటే రేపటి వరకు వేచి ఉండక తప్పదు.


శ్రీనివాసన్: ఇండియా సిమెంట్స్ సహ వ్యవస్థాపకుడైన టిఎస్ నారాయణస్వామి కుమారుడే శ్రీనివాసన్. 67 ఏళ్ల శ్రీనివాసన్ ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌. బిసిసిఐ అధ్యక్ష పదవి చేపట్టడానికి ముందు ఆయన బిసిసిఐ కార్యదర్శిగా పనిచేశారు. 2011లో శశాంక్ మనోహర్ నుంచి అధ్యక్ష పదవిని స్వీకరించారు. బిసిసిఐ కోశాధికారిగా కూడా ఉన్నారు. ఇండియా సిమెంట్స్ లిమిటెడ్‌కు ఐపిఎల్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో అధిక వాటా ఉంది.

మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బిఎస్ సి పూర్తి చేశారు. చికాగోలోని ఇలినోయిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ డిప్లమా పొందారు.1989లో ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఫిక్కీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కూడా అయిన శ్రీనివాసన్ 1996 నుంచి 1998 వరకు మద్రాసు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా ఉన్నారు. సిమెంట్ ఉత్పత్తిదారుల సంఘానికి ఐదు విడతలు అధ్యక్షుడిగా ఉన్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ గవర్నింగ్ బోర్డు చైర్మన్‌గా నాలుగు విడతలు ఉన్నారు. 1992 నుంచి 1996 వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిమెంట్ పరిశ్రమ అభివృద్ధి మండలి చైర్మన్‌గా పనిచేశారు. మద్రాసు ఛాంబర్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎంసిసిఐ) అధ్యక్షుడిగా 1996 నుంచి 1998 వరకు పనిచేశారు. 2000 -2001లో అఖిల భారత ఎంప్లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad