‘ఎమ్మార్’లో బాబును విచారించరేం? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, May 11, 2013

‘ఎమ్మార్’లో బాబును విచారించరేం?

సీబీఐకి వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి ప్రశ్న
రాజధాని నడిబొడ్డున 535 ఎకరాలు ఎమ్మార్‌కు కారుచౌకగా చంద్రబాబు అప్పగించారు
సీబీఐ ఆయన్ను విచారించకుండా చార్జిషీటు ఎలా ఫైల్ చేస్తుంది?


‘ఎమ్మార్’ కంపెనీని రాష్ట్రానికి పరిచయం చేయడంతో పాటు రాజధాని నడిబొడ్డున ఉన్న 535 ఎకరాలను ఆ సంస్థకు కారుచౌకగా కట్టబెట్టిన అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబును ఈ కేసులో సీబీఐ ఎందుకు విచారించడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మార్‌కు సంబంధించి అత్యంత కీలకమైన చంద్రబాబును విచారించకుండా సీబీఐ దర్యాప్తు పూర్తి చేయడం ఉద్దేశపూర్వకంగానే జరిగిందంటూ కేసులో కీలక నిందితుడు, ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడైన దుబాయి ప్రసాద్(కోనేరు రాజేంద్రప్రసాద్) కోర్టులో వేసిన పిటిషన్‌ను ఆయన గుర్తుచేశారు. ‘‘రాష్ట్ర రాజధానిలో 535 ఎకరాల్లో విలాసవంతమైన విల్లాలు, గోల్ఫ్ కోర్సులు, స్టార్ హోటళ్లు నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఏపీఐఐసీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చింది. 

ఆ తర్వాత దాన్ని రద్దు చేసింది. మళ్లీ కొన్నాళ్లకే 2001 జూలై 6న కొత్తగా నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి స్పందించి 5 కంపెనీలు ముందుకొచ్చాయి. అందులో దుబాయికి చెందిన ఎమ్మార్, మలేసియాకు చెందిన ఐఓఐ, హాంకాంగ్‌కు చెందిన సోమ్‌ఏషియా, ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ పల్లోంజి అనే సంస్థలు పాల్గొన్నాయి. అయితే టెండర్ సమయానికి వారంతా తప్పుకొని ఎమ్మార్ మాత్రమే పోటీలో నిలిచేలా చంద్రబాబు స్కెచ్ వేశారు. ఎమ్మార్‌కు ఈ టెండర్ కట్టబెట్టే ప్లాన్‌లో భాగంగా ఎల్‌అండ్‌టీకి కాకినాడ పోర్టు, హైటెక్‌సిటీ నిర్మాణం, ఐఓఐకి జెమ్స్ పార్కు వద్ద అత్యంత విలువైన 10 ఎకరాల కేటాయింపులు చేశారు. ఇంత తతంగం జరిగిన ఈ కేసులో చార్జ్జిషీట్ ఫైనల్ చేసేటప్పుడు దానికి ఆద్యుడైన చంద్రబాబును సీబీఐ ఎందుకు ప్రశ్నించలేదు?’’ అని అంబటి ప్రశ్నించారు.

చంద్రబాబు వ్యతిరేక వార్తలు వేయరేం?
‘‘సీబీఐ ధోరణిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా చంద్రబాబు పల్లెత్తు మాట మాట్లాడకపోవడంలో ఉన్న మతలబేంటి? అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు చంద్రబాబు ఎందుకు దూరంగా ఉన్నారు. ఇదంతా కుమ్మక్కు కాదా?’’ అని అంబటి నిలదీశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకమైన వార్తలు ఎప్పుడు వచ్చినా వాటిని కప్పిపుచ్చేందుకు ‘ఈనాడు’ శతవిధాలా ప్రయత్నం చేస్తోందని అంబటి పేర్కొన్నారు. ఎమ్మార్ కేసుకు సంబంధించి కోనేరు ప్రసాద్ వేసిన పిటిషన్‌కు సంబంధించిన వార్తలో ఎక్కడా కూడా చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా ‘ఈనాడు’ ప్రచురించిన కథనాన్ని అంబటి చదివి వినిపించారు. ఆ పత్రిక తెలుగుదేశం అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తోందని విమర్శించారు.

న్యాయస్థానాలపై మాకు గౌరవముంది
తాము న్యాయస్థానాలను తప్పుబట్టినట్లు కాంగ్రెస్, టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవంలేదని అంబటి అన్నారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పేరుతో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడే రెండు రోజులపాటు ఉండి జగన్‌కు బెయిల్ రాకుండా వ్యవస్థలను మేనేజ్ చేశారని తమ పార్టీ నేత జూపూడి చెప్పారే కానీ, ఎవర్ని మేనేజ్ చేశారనేది ఆయన ఎక్కడా చెప్పలేదని గుర్తుచేశారు. అయితే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. ఇదే విషయాన్ని గతంలో బ్రిటన్‌కు చెందిన డీఎఫ్‌ఐడీ సంస్థ ప్రతినిధి జేమ్స్ మ్యానర్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అందజేసిన రిపోర్టులో చాలా స్పష్టంగా పేర్కొన్నారన్నారు. 

చంద్రబాబు ప్రతీ వ్యవస్థలో తన సొంత మనుషులను జొప్పించి అన్ని వ్యవస్థలనూ మేనేజ్ చేస్తున్నారని రాతపూర్వకంగా వెల్లడించారని చెప్పారు. జేమ్స్ మ్యానర్ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ... ప్రస్తుత రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆ సమయంలోనే సుప్రీంకోర్టులో పిల్ వేశారని చెప్పారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయకపోతే ఆయనకు సైకిల్‌గుర్తు ఎలా వచ్చిందో చెప్పాలని అంబటి ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కున్న తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ ఆఫీసులను ఎలా కబ్జా చేయగలిగారని అడిగారు. బాబు ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఖాయమని, జెండా పీకేయడం కూడా ఖాయమని అంబటి అన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad