రెండు వారాల క్రితం కిడ్నాపైన విద్యార్థి హత్య! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 05, 2014

రెండు వారాల క్రితం కిడ్నాపైన విద్యార్థి హత్య!

పాతబస్తీలో 13 రోజుల కిందట కిడ్నాప్‌నకు గురైన విద్యార్థి కరుణాకర్ (10) కథ విషాదాంతమైంది. అతడిని అపహరించిన నిందితులు తమ వివరాలు వెల్లడవుతాయనే భయంతో చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు. నేరగాళ్ల ఫోన్‌కాల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం రాత్రి మిస్టరీని ఛేదించారు. శనివారం పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో బాలుని మృతదేహాన్ని గుర్తించారు. ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ ఖాదర్ వివరాలు వెల్లడించారు. చాంద్రాయణ గుట్ట ఇంద్రానగర్‌కు చెందిన కాంట్రాక్టు ఉద్యోగి ఎన్నమళ్ల ప్రభాకర్, ఉమారాణికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరి పిల్లల్లో కరుణాకర్ పెద్దవాడు. స్థానిక మదర్స్‌మేరీ హైస్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు. వీరింటికి సమీపంలో ఉంటున్న సెంట్రింగ్ వర్కర్స్ మల్లికార్జున్, మోహన్ దుర్వ్యసనాలకు బానిసలై అప్పుల్లో కూరుకు పోయారు. ఈ నేపథ్యంలో వారు ప్రభాకర్ పిల్లల్లో ఒకరిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని పథకం వేశారు. ఈ క్రమంలోనే సెప్టెంబరు 22న  కరుణాకర్‌ను నిందితులు కిడ్నాప్  చేశారు.
  ఒక నిందితుడు ఆ రోజు సాయంత్రం ఉమారాణికి కాయిన్ బాక్స్‌నుంచి ఫోన్ చేసి.. తాము వారి కుమారుడిని అపహరించామని, రూ.2 లక్షలిస్తే వదిలేస్తామని బెదిరించాడు. దీంతో బాధితులు చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 5 బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చేస్తున్న దశలోనే నిందితులు పోలీసులను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. బాలుడ్ని ఓ యువకుడు బైక్‌పై తీసుకెళ్లడం చూశామని చెబుతూ ఊహాచిత్రానికి క్లూ కూడా ఇచ్చారు. అయితే బాధితులకొచ్చిన కాల్స్ ఓ మొబైల్ నుంచి కావడంతో పోలీసులు ఆ రూట్‌లో దర్యాప్తు చేయగా నిందితుల గుట్టు రట్టయింది. తమను గుర్తించి విషయం వెల్లడిస్తాడనే భయంతో బాలుడిని సెప్టెంబరు 23న  బాలాపూర్ ఆర్‌సీఐ సమీపంలో హత్యచేశామని అంగీకరించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి పోస్టుమార్టానికి పంపారు. నిందితులిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు. 
 

No comments:

Post a Comment

Post Bottom Ad