న్యూయార్క్ లో ప్రధాని మోడీ చారిత్రాత్మక ప్రసంగం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, September 29, 2014

న్యూయార్క్ లో ప్రధాని మోడీ చారిత్రాత్మక ప్రసంగం

న్యూయార్క్:  న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ పార్క్ లో ఎన్నారైలను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. 20 వేలకు పైగా ఎన్నారైలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మోడీ... మోడీ... అంటూ ఎన్నారైలు న్యూయార్క్ అంతా మారుమోగేలా ప్రసంగం ఆద్యంతం చప్పట్లతో, కేరింతలతో హుషారెత్తించారు. మోడీ ప్రసంగం భారత్ లోనే జరుగుతోందా! అన్నంతగా స్పందన వచ్చింది. మోడీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే.....
* నవరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
* అమెరికా, భారత్ ల అభివృద్ధిలో మీ అందరి కృషి అమోఘం.
* మీ ముందుకు రావడం ఎంతో అదృష్టం.
* ఎన్నారైలు ఎంతో కష్టపడి అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు.
* గతంలో భారత్ ను వెనుకబడిన దేశంగా భావించారు. ఇప్పుడు మీ అందరి కష్టంతో ఐటీ హబ్ గా గుర్తిస్తున్నారు.
* భారత్ ప్రపంచ శక్తిగా మారడం వెనుక కోట్లాది మంది కృషి ఉంది.
* ఎన్నికల్లో గెలవడం అనేది ఒక పదవి కాదు. ఒక గొప్ప బాధ్యత.
* 2014లో మీరు ఓటు వేసి ఉండక పోవచ్చు. కానీ, ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసి ఉంటారు.
* మొదటి సారిగా ఎన్డీఏకు ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చారు. భారత ప్రజలు ప్రజాస్వామ్య శక్తిని ప్రపంచానికి చాటారు.
* ఎన్డీఏ ఘన విజయం సాధిస్తుందని గొప్ప గొప్ప పండితులు, జ్యోతిష్కులు కూడా ఊహించి ఉండరు.
* నా ప్రసంగాన్ని వినేందుకు వేలాదిగా తరలి వచ్చారు. ఎంతో మంది బయట వేచి ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు.
* భారత ప్రజలు మార్పును కోరుకున్నారు. పేద ప్రజలు తమ జీవితాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నారు. అందరి కోరికలను ఎన్డీఏ తీరుస్తుంది.
* మా ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అన్నీ తీరుస్తాం. ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా చేస్తాం.
* భగవంతుని మరో స్వరూపమే ప్రజలు. ప్రజలే దేవుళ్లు.
* 21వ శతాబ్ధమంతా ఆసియా దేశాలదే. అందులో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. 
* భారత్ బలమంతా యువశక్తే. వారి సహకారంతో భారత్ విజయపథంలో దూసుకుపోతుంది.
* ప్రపంచంలోని అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నారు. 125 కోట్ల ప్రజలే మన సంపద.
* చిరకాలంగా అమెరికా ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ... అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనదే.
* ప్రజాస్వామ్యమనేది మనకు ఒక విశ్వాసం.
* అమెరికాకు అన్ని దేశాల వారు వస్తుంటారు... కానీ, అమెరికా అభివృద్ధిలో మనమే కీలకం.
* అమెరికా, భారత్ రెండూ కలసి పనిచేస్తే... అద్భుతమైన ప్రగతిని సాధిస్తాం.
* యావత్ ప్రపంచం ఇప్పడు భారత్ వైపే చూస్తోంది.
* భారతమాత కోసం ఎంతో మంది తమ ప్రాణాలను అర్పించారు. భారతీయుల్ని ఏకం చేసిన ఘనత మహాత్మా గాంధీదే.
* స్వాతంత్ర్య పోరాటంలో భారతీయులందరూ పాల్గొన్నారు.
* హాలీవుడ్ సినిమా కన్నా తక్కువ ఖర్చులో అంగారక యాత్రను విజయవంతంగా పూర్తి చేశాం.
* అహ్మదాబాద్ లో ఆటో ఛార్జ్ కి.మీకు రూ. 10 ఉంటే... మామ్ ప్రయాణానికి అయిన ఖర్చు కి.మీకు కేవలం రూ. 7 మాత్రమే.
* దేశ అభివృద్ధికి సుపరిపాలన అత్యంత కీలకం. ప్రజల భాగస్వామ్యంతో ఎన్డీఏ పరిపాలన కొనసాగిస్తుంది. ప్రజల ఆశలను నేను వమ్ము చేయను.
* ప్రజల సంతోషం, బాధ రెండూ నాకు తెలుసు.
* ప్రపంచానికి కావాల్సిన వనరులు, టెక్నాలజీ రెండూ మన వద్ద ఉన్నాయి.
* అభివృద్ధిని సాధించడం అనేది ఒక ఉద్యమంలా కొనసాగాలి.
* స్వాతంత్ర్యోద్యమ స్థాయిలో ఇప్పుడు అభివృద్ధి కోసం పాటుపడాలి.
* భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది.
* జన్ ధన్ కార్యక్రమం ద్వారా బ్యాంకులే సామాన్యుల చెంతకు వచ్చాయి. ఖాతాలు తెరిపించాయి.
* నాలుగు కోట్ల మంది సామాన్యులు ఖాతాలు తెరిచి రూ. 1500 కోట్లకు పైగా ధనాన్ని జమ చేశారు.
* మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో అందరూ భాగస్వాములే.
* కాలం చెల్లిన చట్టాలు మనకు అవసరం లేదు, రద్దు చేస్తాం.
* చవకైన మానవ వనరులకు భారత్ నిలయం.
* టీ అమ్ముకుంటూ ఈ స్థాయికి వచ్చాను. చిన్నచిన్న పనులే చేస్తాను అని అనుకుంటున్నారు... పెద్ద పనులు చేసి భారత్ ను ప్రగతి పథంలో దూసుకెళ్లేలా చేస్తా.
* గంగను శుద్ధి చేయాల్సి ఉంది. మీరు చేయి కలుపగలరా?
* గంగానదిని శుద్ధి చేసే కార్యక్రమాన్ని కొంతమంది మత పరమైన అంశంగా భావిస్తున్నారు. కానీ, అది పర్యావరణానికి సంబంధించిన అంశం.
* దేశంలో ప్రతి కుటుంబానికి మరుగుదొడ్లను నిర్మిస్తాం.
* 2019 మహాత్ముడి 150వ జన్మదినం. దేశాన్ని అప్పటికల్లా పరిశుభ్రంగా మార్చడమే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి.
* ఎన్నారైలకు జీవితకాల వీసా సౌకర్యం కల్పిస్తాం.
* పీఐవో, ఓసీఐలను రెండింటినీ విలీనం చేస్తాం. 
* 2022కు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది... అప్పటికి ప్రతి భారతీయుడికీ సొంత ఇళ్లు ఉండాలనేదే నా లక్ష్యం.
* గాంధీ కూడా ఒకప్పుడు ఎన్నారైనే. 1915లో ఆయన తిరిగి భారత్ వచ్చారు. వచ్చే ఏడాది (2015) ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తాం.
* ఎన్నారైల కలలను మేమే సాకారం చేస్తాం.
* నేను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 15 నిమిషాల విరామం కూడా తీసుకోలేదు.
* మీరంతా వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ... మీ సమస్యలన్నీ నాకు తెలుసు. మీ సమస్యలన్నీ తీరుస్తా.
* ప్రపంచం మొత్తం మార్గదర్శకుల (అధ్యాపకులు) కోసం వేచి చూస్తోంది. భారత్ వారిని అందిస్తుంది.
* భారత్, అమెరికాలు అంగారకుడిపై కూడా మాట్లాడుకుంటున్నాయి. మన ఉపగ్రహం 24న మార్స్ పైకి వెళ్తే అమెరికన్లది 22న వెళ్లింది.
* చవక ఉత్పత్తులకు భారత్ స్వర్గధామం. మీ అందరి గమ్యస్థానం భారతదేశమే.
ప్రసంగం చివర్లో భారత్ మాతాకీ జై అంటూ మోడీ నినదించారు. సభకు హాజరైన అందరి చేత ఇదే నినాదం చేయించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad